గెస్ట్‌ లెక్చరర్లను తొలగించడం అన్యాయం

– పాతవారిని కొనసాగించాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్యాసంవత్సరం మధ్యలో గెస్ట్‌ లెక్చరర్లను తొలగించడం అన్యాయమని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ విమర్శించింది. జీవోనెంబర్‌ 1145 ప్రకారం పాత వారిని కొనసాగించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 408 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న 1,654 మంది గెస్ట్‌ లెక్చరర్లను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఇంటర్‌ విద్యాశాఖ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. యథావిధిగా పాతవారిని కొనసాగించాలని కోరారు.
గెస్ట్‌ లెక్చరర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి : డీవైఎఫ్‌ఐ
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేసిన గెస్ట్‌ లెక్చరర్లను సత్వరమే విధుల్లోకి తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. గత పదేండ్ల నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో గెస్ట్‌ లెక్చరర్లుగా పనిచేస్తున్న 1,654 మందిని తొలగించి వారి స్థానంలో కొత్తగా నోటిఫికేషన్‌ వేయడం సరైంది కాదని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయాన్ని సత్వరమే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
నవీన్‌ మిట్టల్‌ను తొలగించాలి : పీడీఎస్‌యూ, పీవైఎల్‌
గెస్ట్‌ లెక్చరర్లను తొలగించడం అన్యాయమని పీడీఎస్‌యూ, పీవైఎల్‌ అధ్యక్ష, కార్యదర్శులు పి మహేష్‌, ఇందూరి సాగర్‌, ఎస్వీ శ్రీకాంత్‌, కోలా లక్ష్మినారాయణ విమర్శించారు. ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌గా ఉన్న నవీన్‌ మిట్టల్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. గెస్ట్‌ లెక్చరర్లను కొనసాగించాలని కోరుతూ శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలను సమర్పిస్తామనీ, ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. గెస్ట్‌ లెక్చరర్లు చేస్తున్న న్యాయమైన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.