కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 1 నుంచి 15 వరకు జిల్లా సదస్సులు

కేంద్ర, రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాల పిలుపు
20న హైదరాబాద్‌లో రాష్ట్ర సదస్సు
21 నుంచి ఆగస్టు 8 వరకు గ్రామ,
మండల కేంద్రాల్లో ప్రచారం
 ఆగస్టు 9, 10 తేదీల్లో హైదరాబాద్‌తోసహా అన్ని జిల్లాల్లో మహాధర్నా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలంటూ కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ, కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఇందులోభాగంగా జూలై 1 నుంచి 15 వరకు జిల్లా సదస్సులు నిర్వహించాలని కోరాయి. 20న హైదరాబాద్‌లో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపాయి. 21 నుంచి ఆగస్టు 8 వరకు గ్రామ, మండల కేంద్రాల్లో ప్రచారం చేయాలని పిలుపునిచ్చాయి. ఆగస్టు 9, 10 తేదీల్లో హైదరాబాద్‌తోసహా అన్ని జిల్లాల్లో మహాధర్నా చేపట్టనున్నట్టు తెలిపాయి. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్‌. డీ. చంద్రశేఖర్‌ (ఐఎన్‌టీయూసీ), ఎస్‌.బాలరాజు (ఏఐటీయూసీి), పాలడుగు భాస్కర్‌, కె. భూపాల్‌, జె. వెంకటేష్‌ (సీఐటీయూ), రెబ్బా రామారావు, అంజాద్‌ (హెచ్‌ఎంఎస్‌), ఎస్‌ఎల్‌ పద్మ, కిరణ్‌ (ఐఎఫ్‌టీయూ), ఎంకే బోస్‌, ప్రసాద్‌ (టీఎన్‌టీయూసీ), ఎం. శ్రీనివాస్‌ (ఐఎఫ్‌టీయూ), కె. ఆంజనేయులు (ఏఐయూటీయూసీ), ఇ. నాగేశ్వరరావు (సీజీ కాన్ఫెడరేషన్‌), జి. తిరుపతయ్య(ఎల్‌ఐసీ), పి. వెంకట్రామయ్య, టీ, సతీష్‌, సుందర్‌రామ్‌ (బెెఫీ), రాజు భట్‌ (మెడికల్‌ రిప్స్‌) రాష్ట్ర నాయకులు విలేకర్లతో మాట్లాడారు. కేంద్రంలోని మోడీ సర్కారు గత తొమ్మిదేండ్లుగా ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని వారు ఈ సందర్భంగా విమర్శించారు. దేశంలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. 29 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్లను తెచ్చి కార్మిక హక్కులను హరిస్తున్నదని విమర్శించారు. రైల్వే, రక్షణ, ఫార్మా, సింగరేణి తదితర సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేని మోడీ సర్కార్‌ అసమర్ధత వల్ల కార్మికుల కొనుగోలు శక్తి క్షీణిస్తున్నదని తెలిపారు. పెన్షన్‌ నిధులను సైతం కేంద్రం కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నదని విమర్శించారు. కార్మికులు కష్టాల్లో ఉన్నప్పటికీ కనీస వేతనాలు సవరించడం లేదని చెప్పారు. దేశంలో కార్మిక రంగ సమస్యలను పరిష్కరించడం చేతకాని బీజేపీ ప్రభుత్వం కుల, మత, ప్రాంతీయ, అస్థిత్య ఉద్యమాలకు ఆజ్యం పోస్తూ కార్మికవర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెలతోపాటు జూలై, ఆగస్టు నెలలో చేపట్టబోతున్న ప్రచార కార్యక్రమాల్లో రాష్ట్రంలోని యావత్‌ కార్మికవర్గం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
డిమాండ్లు
నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 5 కనీస వేతనాల జీఓలను అమలు చేయాలి. మిగిలిన షెడ్యూల్డ్‌ పరిశ్రమలకు వెంటనే కనీస వేతన జీవోలు ప్రకటించి అమలుచేయాలి.
రైతాంగానికి కనీస మద్దతు ధర ప్రకటించాలి. ఎలక్ట్రిసిటీ బిల్లు – 2022ను వాపస్‌ తీసుకోవాలి.
ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయరాదు.
నేషనల్‌ మానిటైజేషన్‌ పైపులైన్‌ను రద్దు చేయాలి.
కాంట్రాక్ట్‌ విధానాన్ని రద్దుచేసి, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి.
ట్యాక్స్‌ పరిధిలో లేని అసంఘటితరంగ కార్మికులకు రూ.7,500లు నెలకు చెల్లించాలి.
అసంఘటితరంగ కార్మికులను ‘యూనివర్సల్‌ సోషల్‌ సెక్యూరిటీ స్కీమ్‌’ను ప్రవేశపెట్టాలి.
ఉపాధి చట్టానికి కేంద్ర బడ్జెట్‌లో నిధులను పెంచాలి.ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలి.
అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్నభోజనం లాంటి స్కీమ్‌ వర్కర్లకు చట్టపరమైన కనీస వేతనాలు చెల్లించాలి. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
దేశంలోని అత్యధిక ధనవంతుల (కార్పొరేట్‌ వర్గాలు) ఆదాయంపై సంపద పన్నును పెంచి, విద్యా, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలకు కేటాయించాలి.
పెట్రోల్‌, డీజిల్‌పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించాలి.
ప్రజా పంపిణీ ద్వారా నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు పంపిణీ చేయాలి.
బీడీ కార్మికులందరికీ కనీస వేతనాల జీవోను పునరుద్ధరించాలి.

Spread the love