అండగా ఉంటాం..ఆందోళన వద్దు

– జర్నలిస్టు తులసికి ఫెడరేషన్‌ పరామర్శ
నవతెలంగాణ-హైదరాబాద్‌
స్వతంత్ర పాత్రికేయురాలు తులసిచంద్‌ను తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర నాయకత్వం పరామర్శించింది. అండగా ఉంటామనీ, ఆందోళన పడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పింది. ప్రజల గొంతుకను ఇక ముందు కూడా వినిపించాలని కోరింది. సంఘ వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బుధవారం హైదరాబాద్‌లో తులసిచంద్‌ నివాసంలో ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, కార్యదర్శులు ఎస్‌.కె సలీమ, ఇ.చంద్రశేఖర్‌, ఉపాధ్యక్షులు బి. రాజశేఖర్‌ ఆమెను కలిశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వీడియోలు, అసాంఘీక శక్తుల బెదిరింపుల విషయమై దాదాపు గంటసేపు చర్చించారు. వార్తాకథనాల్లో ప్రజాకోణాన్ని కొనసాగించాలనీ, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘తనకు గత సంవత్సర కాలంగా బెదిరింపులు వస్తున్నాయని’ ఫెడరేషన్‌ బృందానికి తులసి తెలియజేశారు. మతానికి సంబంధించిన వీడియో చేసినప్పటి నుంచే ట్రోల్స్‌ ప్రారంభమయ్యాయని వివరించారు. తనకు మీడియా అక్రిడిటేషన్‌ కార్డు లేదని చెప్పారు. నేను నిజాలను మాత్రమే ప్రజలకు చెప్పాలనీ భావించాననీ, ఆ పనిని ఇక ముందు కూడా చేస్తానని అభిప్రాయపడ్డారు. ఇందుకు స్పందిన ఫెడరేషన్‌ నాయకత్వం’ నిరభ్యంతరంగా మీ పని మీరు చేయండి..మేము మీకు వెన్నంటే ఉంటాం.మద్దతు ఇస్తాం..మీ తరపున పోరాడతాం’ అని హామీ ఇచ్చారు. ఫెడరేషన్‌ బృందం తన ఇంటికి వచ్చి తనకు సంఘీబావం చెప్పడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ట్రోల్స్‌, బెదిరింపుల విషయంలో రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాననీ, ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయిందని వివరించారు. ఆకేసు విచారణ ఎంతవరకు వచ్చిందనే విషయాన్ని ఇంకా తెలుసుకోవాల్సి ఉందని అన్నారు ఇందుకు ఫెడరేషన్‌ బృందం తనతో మాట్లాడుతూ ‘అన్ని విషయాల్లో సహకరిస్తామని’ చెప్పారు.

Spread the love