ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

నవతెలంగాణ-చేవెళ్ల
మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం అవుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని కందావాడ గ్రామంలో మన ఊరు-మన బడి పాఠశాల మౌలిక వసతుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రూ. 56.86 లక్షల వ్యయంతో చేపట్టిన ప్రైమరీ, జిల్లా పరిషత్‌ పాఠశాల భవనాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ నుంచి రోజుకొక కార్యక్రమంతో ప్రజలతో మమేకం అవుతూ వారికి ప్రభుత్వ చేసిన కార్యక్రమాలు వివరిస్తున్నట్టు తెలిపారు. నేడు ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా వర్షాలు కురావలని, రైతులకు మేలు జరగాలని కోరుకున్నానని ఇక్కడికి వచ్చే సరికి చినుకులు రావటం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. యదాద్రిని అధ్బుతంగా నిర్మించి, ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ, రామప్ప లాంటి ఆలయాలకు యునెస్కో గుర్తింపు లభించిందాన్నారు. సిరిసిల్ల వేములవాడ దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ, అన్ని ఆలయాల్లో దూప దీప నైవేధ్యాలు జరిగేలా కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా కేసీఆర్‌ వెయ్యికి పైగా నిర్మించిన గురుకులాల్లో 6 లక్షల మంది పై చిలుకు విద్యార్థులు చదువుతున్నారనీ, ఒక్కో విద్యార్థిపై రూ.లక్షా 25 వేలు వెచ్చించినట్టు చెప్పారు. మన ఊరు-మన బడిలో భాగంగా 26 వేల పాఠశాలల్లో రూ.7200 కోట్లపై చిలుకు నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెడితే అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్యపుస్తకాలు,నోట్‌ బుక్క్‌, అందజేసినట్టు వివరించారు. మధ్యాహ్న భోజనం వండే వారికి ఒక వేయి నుంచి 3 వేలకు పెంచినట్టు తెలిపారు. ఉదయం పూట ఇచ్చే రాగి జావాలో ప్రోటీన్లు, విటమిన్లు ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరును ప్రాజెక్ట్‌ నిర్మించి, ఈ ప్రాంతాన్నీ సస్యశ్యామలం చేస్తారనే నమ్మకం, ప్రజలకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో సుసింధర్‌రావు, ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ మర్పల్లి మాలతి క్రిష్ణారెడ్డి, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మిట్ట వెంకటరంగారెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మెన్‌ నర్సిములు, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్‌, బీఆర్‌ఎస్‌ యూత్‌ మండల అధ్యక్షుడు తోట శేఖర్‌, సర్పంచుల సంఘం మండల అధ్యక్షలు శేరి శివారెడ్డి, అందవాడ గ్రామ సర్పంచ్‌ అరుంధతి సాయిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు రవీందర్‌ యాదవ్‌, బీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షులు నరేందర్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ కావ్య, సర్పంచులు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, కౌకుంట్ల రైతుబంధు సమితి ఆధ్యక్షుడు చింత కింది నాగార్జున రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాంరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love