అసైన్డ్‌ భూములను గుంజుకుంటున్నారు

– హెచ్‌ఎండీఏ లేఅవుట్లు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగం
పరిహారం ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో 30ఎకరాల భూములను లాక్కొవడానికి అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఎకరాకు 500 గజాల స్థలం ఇస్తామంటూ పట్టాలు ఇవ్వకుండా నమూన పట్టాలు ఇస్తున్నారు’ అని బాచుపల్లికి చెందిన కమ్మెట రామస్వామి ఆవేదన వ్యక్తంచేశారు.’70ఏండ్లుగా సాగు చేసుకుంటున్నాం. కరెంట్‌ సౌకర్యంలేకపోతే పోరాడి తెచ్చు కున్నాం. తీరా పంటలు వేసుకునే సమయం లోనే అధికారులు మా భూములు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. భూమిని నమ్ముకుని బతుకు తున్నాం. దీన్ని గుంజుకుంటే బదికేదెలా?’ అని బోడుప్పల్‌కు చెందిన నత్తిమైసయ్య వాపోయారు. ఇలాంటి పరిస్థితి ఇద్దరికే కాదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అసైన్డ్‌ భూ బాధితులందరిదీ ఇదే దుస్థితి. సర్కార్‌ ఇచ్చిన అసైన్డ్‌ భూముల్లోనే లేఅవుట్లతోపాటు వైకుంఠదామాలు, రైతు వేదికలు, పల్లె పకృతి వనాలను నిర్మిస్తున్నారు. మేడ్చల్‌ జిల్లా నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మూడెకరాల భూమిలో జాంభవంతుని గుడితోపాటు వేద పాఠశాల, కమ్యూనిటీ హాల్‌ ఉన్నా ఈ భూమిని లాక్కొవాలని అధికారులు కసరత్తు చేస్తున్నారని బాధితులు వాపోతు న్నారు. భూములను తీసుకుంటున్న ప్రభుత్వం ఏలాంటి పరిహారం ఇవ్వడానికి కూడా ముందుకురావడంలేదు.
30వేల ఎకరాలకు ఎసరు
రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్ణణాభివృద్ధి కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో మోడల్‌ లేఅవుట్ల పేరుతో అభివృద్ధి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. అప్పట్లో పేదలకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్‌, భూదాన్‌, సీలింగ్‌ భూములను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నది. భూ యజమానులకు నామమాత్రపు పరిహారం ఇచ్చి లాక్కోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. అందులోభాగంగానే ఉమ్మడి రాష్ట్రంలో పేదలకు సర్కార్‌ ఇచ్చిన అసైన్డ్‌, భూదాన్‌, సీలింగ్‌ భూములు మొత్తం సుమారు 30వేల ఎకరాలను గుంజుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. మేడ్చల్‌ జిల్లాలోని బాచుపల్లిలో 30 ఎకరాలను 20మంది రైతులకు అప్పట్లో ఇచ్చారు. మేడిపల్లిలో 116ఎకరాల భూమిని 38మంది రైతులకు, బోడుప్పల్‌లో 61మంది రైతులకు 336 ఎకరాలు ఇచ్చారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని మేకలగట్టు గ్రామంలో 70 మంది రైతులకు 120 ఎకరాలు, సూర్యాపేటలో 23మంది రైతులకు 60 ఎకరాలు కేటాయించారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో 27 మందికి చెందిన 102ప్లాట్లు, కవాడిపల్లిలో 32 మందికి చెందిన 91 ప్లాట్లు, రాజేంద్రనగర్‌ మండలంలోని బుద్వెల్‌లో 120 మంది రైతులకు సంబంధించిన 200 ఎకరాలు, తుర్కఎంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలో తొర్రూర్‌లో 100 ఎకరాలు, మోకిలా గ్రామంలో 160 ఎకరాలు, మన్సాన్‌పల్లిలో 38.22 ఎకరాల భూములపై అధికారులు కన్నేశారు.
పరిహారం ప్రశ్నార్థమే
పేదలకు సంబంధించిన అసైన్డ్‌ భూములను లబ్ధిదారుల నుంచి రెవెన్యూశాఖ సరెండర్‌ చేసుకుని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు అప్పగిస్తున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాల్లోని బాచుపల్లి, మేడిపల్లి, మన్నెగూడ, మునగనూరు, కవాడిపల్లి, బుద్వేల్‌ ప్రాంతాల్లో అసైన్డ్‌ భూములను వేలం ద్వారా అమ్మడం, పెద్దపెద్ద లేఅవుట్లలో ప్లాట్లు చేసి అమ్ముతున్నారు.కొన్ని ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్నారు. ఈ అసైన్డ్‌ భూముల ద్వారా కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్న సర్కార్‌ పేదలకు నయాపైసా పరిహారం ఇవ్వడానికి ముందుకురావడంలేదు. సర్కార్‌ కేటాయించిన అసైన్డ్‌ భూమి తనకు దక్కదేమోనని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని బోర్పట్లకు చెందిన జక్కు నందీశ్వర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ భూములను లాక్కోవద్దు
భూమి హక్కు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక. అలాంటి భూమిని పేదలకు దూరం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. అసైన్‌భూములను గుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. నిషేధిత జాబితా నుంచి అసైన్‌ భూములను తొలగించడంతోపాటు రీసర్వే చేయాలి. రైతు బంధు కూడా ఇవ్వాలి.
– తెలంగాణ భూ రక్షణ సమితి (టీబీఆర్‌ఎస్‌) అధ్యక్షులు బుగ్గ మైసయ్య