సూర్యకాంతి లేకున్నా…

మొక్కలు పెంచుకోవాలని చాలా మంది అనుకుంటారు. కాని బయట స్థలం లేక పెంచుకోలేకపోతున్నామని అంటుంటారు. పట్టణాల్లో అయితే సూర్యకాంతి పడని ఇండ్లు చాలా ఉంటాయి. అందుకే మొక్కలు పెంచుకోవాలనే కోరిక చాలా మందికి కల గానే ఉంటుంది. అయితే సూర్యరశ్మి లేకపోయినా పచ్చగా ఉండి బాగా పెరిగే కొన్ని మొక్కలు ఉన్నాయి. వీటిని తక్కువ కాంతి మొక్కలు అంటారు. అందువల్ల ఇంట్లో తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశంలో నాటవచ్చు. ఇవి ఇంటి అందాన్ని కూడా పెంచుతాయి.
కాస్ట్‌ ఐరన్‌ ప్లాంట్‌ : ఈ మొక్కకు దాని లక్షణాల కారణంగా ఆ పేరు వచ్చింది. మొక్కలు నాటడం మీద పెద్దగా అనుభవం లేకున్నా, దీనిని సులభంగా పెంచుకోవచ్చు. ఎందుకంటే ఈ మొక్కకు ఎక్కువ పోషణ అవసరం ఉండదు. అలాగే, సూర్యరశ్మి లేకుండా కూడా సులభంగా పెరుగుతుంది.
చైనీస్‌ ఎవర్‌ గ్రీన్‌ ప్లాంట్‌ : ఈ మొక్కను అగ్లోనెమా అంటారు. దీనికి కనీస కాంతి అవసరం కాబట్టి మీరు ఈ మొక్కను ఇంటి లోపల నాటవచ్చు. కానీ ఈ మొక్కలకు క్లోరిన్‌ ఉన్న నీటిని పోస్తే ఎండిపోయే అవకాశం ఉంటుంది.
ఫిలోడెండ్రాన్‌ ప్లాంట్‌ : ఈ మొక్క గాలిని శుద్ధి చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫిలోడెండ్రాన్‌ మొక్కలో అనేక రకాలు ఉన్నాయి. ఈ మొక్క పెరగడం ప్రారంభించినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కుండలో పెంచుతూ నిటారుగా ఉండే కర్రను ఆధారంగ ఉంచాల్సి ఉంటుంది. తద్వారా ఈ మొక్క సరిగ్గా పెరుగుతుంది.
సింగోనియం మొక్క : ఈ మొక్కను ‘యారోహెడ్‌’ అని కూడా అంటారు. ఈ మొక్క ఆకులు బాణపు తలల వలె ఉంటాయి. ఈ మొక్క ఏదైనా భాగాన్ని తీసుకునైనా నాటవచ్చు. ఇది ఆక్సిజన్‌ను పుష్కలంగా అందిస్తుంది. గాలిని శుద్ధి చేస్తుంది. దీనిని నేల, నీరు రెండింటిలోనూ పెంచవచ్చు. అంతేకాదు, చిన్న మొక్కలను సీసా లేదా పూల కుండల్లో కూడా నాటవచ్చు.
స్నేక్‌ ప్లాంట్‌ : స్నేక్‌ ప్లాంట్‌ గాలిని శుద్ధి చేయడానికి ఉత్తమమైన మొక్కగా పేర్కొనవచ్చు. ఈ మొక్క మట్టిలో, నీటిలో రెండింటిలోనూ నాటవచ్చు. ఈ మొక్కకు ప్రతిరోజూ నీరు పెట్టవలసిన అవసరం లేదు. ఇంట్లో ఎక్కడైనా ఉంచుకోవచ్చు.

Spread the love