ప్రతిపైసా పునరావాసానికే కేటాయించాలి

– కేంద్ర ప్రాజెక్టుపై మోడీది బాధ్యతారాహిత్య వ్యవహారం :కుక్కునూరు బహిరంగ సభలో సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
– టీడీపీ, జనసేన నాయకుల పూర్తి మద్దతు
ఏలూరు : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముందుగా ప్రతి పైసా పునరావాసానికే ఖర్చు చేయాలని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ఈ నెల 20వ తేదీన అల్లూరి జిల్లా నెల్లిపాకలో ప్రారంభమైన పోలవరం పోరుకేక మహాపాదయాత్ర ఎనిమిదో రోజు మంగళవారం ఏలూరు జిల్లా కుక్కునూరు, జీలుగుమిల్లి మండలాల్లో కొనసాగింది. ఉదయం కుక్కునూరు మండలం దాచారం గ్రామంలో పాదయాత్ర ప్రారంభమై కుక్కునూరు చేరుకుంది. అనంతరం కుక్కునూరులో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వై.నాగేంద్రరావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో పాదయాత్ర సాగుతుందన్నారు. గతేడాది జులైలో వచ్చిన వరదల సమయంలో తాను ఇక్కడకు వచ్చానని, కనీసం తాగునీరు కూడా అందించలేని పరిస్థితి ఉందని విమర్శించారు. ఆ సమయంలో ఇండ్లు ఖాళీ చేసి పునరావాస కాలనీలకు వెళ్లినవారు చాలామంది అక్కడే ఉన్నారన్నారు. వరదలకు ఇండ్లు కోల్పోవడంతో ఇక్కడకు వచ్చే పరిస్థితి లేకుండాపోయిందన్నారు. 37 మీటర్లకు మునిగిపోయే గ్రామాలను 45.72 కాంటూరులో చేర్చడం బాధాకరమన్నారు. నిర్వాసిత కాలనీలకు వెళ్తే అక్కడ కనీస వసతుల్లేవన్నారు. పోలవరం ప్రాజెక్టుపై పనికిమాలిన లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. మళ్లీ వరదలు వస్తాయని ముందస్తు జాగ్రత్తలు చేపట్టకుంటే ఈసారి ప్రజలు క్షమించరన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, దీనిపై మోడీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని శ్రీనివాసరావు అన్నారు. కేంద్రం మెడలు వంచాల్సిన జగన్‌ ప్రభుత్వం కాళ్లు పట్టుకుంటుందన్నారు. కేసులు మాఫీ చేస్తాం తప్ప నిధులు ఇచ్చేదిక లేదు అన్నట్లు కేంద్రం పెద్దలు మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికే పదేండ్లు పూర్తయిందని, ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతిపైసా పునరావాసానికే ఖర్చుపెట్టాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, మంతెన సీతారాం, వి.వెంకటేశ్వరరావు, లోక్‌నాధం, ఐద్వా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి, నేతలు తెల్లం రామకృష్ణ, నాగమణి, డిఎన్‌విడి.ప్రసాద్‌, గుడిపాటి నరసింహారావు పాల్గొన్నారు.ప్రభుత్వానికి నిర్వాసితుల సమస్యలు పట్టడంలేదని టీడీపీ,జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పాదయాత్రకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఏపీపై కేంద్రం కక్ష తీర్చుకుంటుందని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ అన్నారు. సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి చలసాని శ్రీనివాస్‌ సంఘీభావం తెలిపారు.

Spread the love