తెలంగాణలో ఉనికి బలోపేతంపై దృష్టి

– కామధేను ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!
హైదరాబాద్‌ : తెలంగాణలో తమ మార్కెట్‌ వాటాను పెంచుకోవడంపై కామధేను దృష్టి సారించింది. ఇందుకోసం ఆ కంపెనీ తయారు చేసి విక్రయించే టిఎంటి బార్స్‌ ఉత్పత్తిని పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ తన ప్రీమియం బ్రాండ్‌ ‘కామధేను ఎన్‌ఎక్స్‌టి’ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని యోచిస్తోన్నట్లు పేర్కొంది. తదుపరి తరం హైఎండ్‌ ఇంటర్‌లాక్‌ స్టీల్‌ టిఎంటి బార్‌ 3.0 లక్షల మెట్రిక్‌ టన్నుల ప్రీమియం బార్‌లను 3.6 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచుకోనున్నట్లు పేర్కొంది. అమ్మకాలను బలోపేతం చేసుకోవడానికి ఏడాదిలో మరో 100 మంది డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లను జోడించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కామధేను లిమిటెడ్‌ డైరెక్టర్‌ సునీల్‌ అగర్వాల్‌ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 350 మంది డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని పేర్కొన్నారు.