ఎక్కడ చూసినా లింగ వివక్షే !

– అన్ని రంగాలలో మహిళలంటే చిన్నచూపే
– 90 శాతం స్త్రీల విషయంలో ఇదే పరిస్థితి
న్యూఢిల్లీ : మహిళలు అన్ని రంగాలలో అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. కఠినమైన వృత్తులలో సైతం విజయాలు సాధిస్తున్నారు. అయితే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా వారిపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ప్రపంచ జనాభాలో 90 శాతం మంది ప్రజలు మహిళల విషయంలో వివక్ష ప్రదర్శిస్తున్నారన్న చేదు నిజం ఇటీవల విడుదలైన ఓ అధ్యయనంలో బయటపడింది.
2023వ సంవత్సరపు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన లింగ సామాజిక నిబంధనల సూచిక ప్రకారం మహిళలు రాజకీయంగా, విద్యాపరంగా, ఆర్థికపరంగా, భౌతికంగా వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. రాజకీయాలకు సంబంధించి ప్రజాస్వామిక వ్యవస్థలలో పురుషులకు ఎన్ని హక్కులు ఉంటాయో మహిళలకు కూడా అంతే ఉంటాయి. అయితే మహిళలతో పోలిస్తే పురుషులే అధిక సంఖ్యలో రాజకీయ నాయకులు అవుతున్నారు. విద్యాపరంగా చూస్తే విశ్వవిద్యాలయాలలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా చదువుకుంటున్నారు. ఆర్థిక విషయాలకు సంబంధించి ఉద్యోగాలు చేసే మహిళల కంటే పురుషులకే ఎక్కువ హక్కులు ఉంటున్నాయి. మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. శారీరకంగా చూస్తే మహిళల కంటే పురుషులే దృఢంగా ఉంటారు. ఇలా అన్ని విషయాలలోనూ పురుషుల ఆధిపత్యం కొనసాగుతోంది.
అధ్యయనం ప్రకారం ప్రపంచ జనాభాలో 61% మంది రాజకీయంగా, 28% మంది విద్యావిషయంగా, 60% మంది ఆర్థికంగా, 75% మంది భౌతికంగా మహిళల పట్ల వివక్ష చూపుతున్నారు. మన దేశంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జనాభాలో 99% మంది ప్రజలు మహిళలకు సంబంధించి కనీసం ఒక్క విషయంలోనైనా వివక్ష ప్రదర్శిస్తున్నారు. 69% మంది భారతీయులు రాజకీయంగా, 39% మంది విద్యాపరంగా, 75% మంది ఆర్థికంగా, 92% మంది భౌతికంగా మహిళల విషయంలో వివక్ష చూపుతున్నారు.
మహిళలు రాజకీయ నేతలుగా ఎదగాలని, మంచి విద్యావంతులై సంపాదనపరులు కావాలని భారతీయులు కోరుకుంటారు. అయితే ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తారని అధ్యయనం తెలిపింది. భార్యలు భర్తల చేతిలో హింసకు గురవడం నిత్యకృత్యమవుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేమంటే పురుషులతో పాటు మహిళలు కూడా సమాన సంఖ్యలో తోటి స్త్రీల పట్ల వివక్ష వహిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో మహిళల హక్కులకు సంబంధించి దేశంలోనూ, అంతర్జాతీయంగానూ ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నందున పరిస్థితిలో కొంత మెరుగుదల కన్పిస్తోందని అద్యయనం వివరించింది. పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు ఉంది. విద్యా సంస్థలలో ప్రవేశం విషయంలోనూ సమాన హక్కులు ఉన్నాయి. వివిధ అంశాలపై వారు పురుషులతో సమానంగా గొంతు విప్పుతున్నారు. నాయకత్వ స్థానాలలోనూ మహిళలూ గణనీయమైన ప్రగతి సాధిస్తున్నారు. 1995 నుండి ప్రభుత్వాల అధినేతలుగా పది శాతం మంది మహిళలు కొనసాగారు. అయితే ఇదంతా పాక్షిక విజయంగానే భావించవచ్చు.
భారత్‌ వంటి దక్షిణాసియా దేశాలలో మహిళలకు మరింత మద్దతు అవసరమని అధ్యయనం అభిప్రాయపడింది. 2021లో పురుషుల తలసరి ఆదాయంలో మహిళల తలసరి ఆదాయం కేవలం 21%గానే ఉంది. ఇది కెన్యా, కాంగో, దక్షిణ సూడాన్‌, ఉగాండా, జింబాబ్వే వంటి ఆఫ్రికా దేశాలలో 75%గా ఉండడం విశేషం. వివక్షాపూరిత సమాజం మహిళల స్వేచ్ఛను, అవకాశాలను పరిమితం చేయడమే కాకుండా సమాజాలకు మహిళా నాయకత్వ ప్రయోజనాలు లభించకుండా అడ్డుకుంటోంది. అంతటితో ఆగక వారి అనుభవాలకు, సామర్ధ్యాలకు, గొంతుకలకు, ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తోంది.

Spread the love