ఆయిల్ పామ్ కోసం భూమిని కేటాయించిన గోద్రెజ్ ఆగ్రోవెట్

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో కంపెనీకి 47,000 ఎకరాల భూమిని కేటాయించినట్లు ఈ రోజు గోద్రెజ్ ఆగ్రోవెట్ (జిఎవిఎల్) యొక్క ఆయిల్ పామ్ బిజినెస్ వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ (హార్టికల్చర్ & సెరికల్చర్ ) కేటాయించిన ఈ ప్రాంతాన్ని ఆయిల్ పామ్ సాగును విస్తరించడానికి మరియు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కంపెనీ వినియోగించనుంది. ఈ కేటాయింపుపై జిఎవిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ, “తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన తాజా కేటాయింపులో భాగంగా అదనపు జిల్లాను అందుకోవడం మాకు ఆనందంగా ఉంది. ఇది జిఎవిఎల్ యొక్క నిబద్ధత , ఆయిల్ పామ్ తోటలను పెంచడానికి మరియు ఈ ప్రాంతంలో రైతు శ్రేయస్సును ప్రోత్సహించడానికి చేసిన ప్రయత్నాలకు నిదర్శనం. రైతులకు మేలు చేసే మా ప్రయత్నానికి తమ మద్దతు తెలియజేయటంతో పాటుగా నిబద్ధతను చాటుతున్న తెలంగాణ ప్రభుత్వం కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము…” అని అన్నారు. “ఆయిల్ పామ్ వ్యాపారంలో మూడు దశాబ్దాల మా నైపుణ్యం, స్థిరమైన ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ప్రక్రియలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వివిధ రకాల వనరులను అందించడంలో మాకు సహాయపడింది. రాబోయే సంవత్సరాల్లో ఆయిల్ పామ్ దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ మద్దతు ఖచ్చితంగా తోడ్పడుతుంది ”అని ఆయన అన్నారు. ఇటీవల ఏలూరు జిల్లా చింతలపూడిలో జిఎవిఎల్ ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీని ప్రారంభించింది. ఇది నూనె , కొవ్వులలో విలువ ఆధారిత ఉత్పత్తుల కోసం జిఎవిఎల్ యొక్క మొదటి డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ మరియు ఈ ప్రాంతంలోని ఇతర ముడి పామాయిల్ ప్లేయర్‌ల నుండి డిమాండ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కంపెనీ ఆయిల్ పామ్ కార్యకలాపాల నుండి ఉత్పన్నమయ్యే క్యాప్టివ్ అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది.