ట్రాక్టర్‌ ను ఢీకోటిన గూడ్స్‌ రైలు.. ఆరుగురికి గాయాలు

నవతెలంగాణ – లక్నో: గూడ్స్‌ రైలు ట్రాక్టర్‌ ట్రాలీని ఢీకొట్టి పట్టాలు తప్పింది.  ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ రోజు ఉదయం బన్సీ పహర్‌పూర్ – రుబ్బాస్ ప్రాంతంలోని రైలు గేటు వద్ద ట్రాలీ ఉన్న ట్రాక్టర్‌ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో అటుగా వచ్చిన గూడ్స్‌ రైలు దానిని ఢీకొట్టింది. ఈ సంఘటనలో రైలు ఇంజిన్‌ వెనుక ఉన్న గూడ్స్‌ వ్యాగన్‌ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ ట్రాలీలో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.  గాయపడిన వారికి ప్రాణ ముప్పు లేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని చెప్పారు.  సమాచారం తెలిసిన వెంటనే యాక్సిడెంట్‌ రిలీఫ్‌ ట్రైన్‌ సంఘటనా స్థలానికి చేరినట్లు పేర్కొన్నారు. అలాగే పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు వ్యాగన్‌ను రైల్వే సిబ్బంది సరిచేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Spread the love