గురివింద సూక్తి ముక్తావళి!

ఎదుటివారి నలుపు గురించి గురివిందలు మాట్లాడటం ఆశ్చర్యమే! అదీ తల్లి గొబ్బెమ్మలాంటి పెద్ద గురివింద నీతులు చెప్పడం ఒకింత అసహ్యం కూడా కలుగుతోంది. తన ‘శుద్ధపూసత్వా’న్ని వెలుగులోకి తేవడానికి, నిలువునా నిలబెట్టడానికి ఇతర పార్టీలన్నింటినీ అవినీతిపరమైనవన్న వాఖ్యానం, చేస్తున్న ఆర్భాటం ‘భక్తుల’ కెలావున్నా మిగిలిన దేశ ప్రజలకు జుగుప్స కలిగిస్తున్నాయి. అన్ని పత్రికల్లో, లేదా చాలా పత్రికల్లో బీజేపీ అస్మదీయులు దిగబడి ఉన్నారు. మోడీ మీద వాలే ‘ఈగల్ని’ తోలడం వారి తక్షణ కర్తవ్యం. ఇది మరీ ‘నాటు’గా ఉంటే, మోడీపై ఈగలు వాలకుండా చూడటం వారి వృత్తి ధర్మం! ఢిల్లీ వీధుల్లో పోయే తెలుగువారి పరువు గురించీ, అది మోరీల్లో కలుస్తున్న తీరు గురించీ ఒక ‘సత్య’వంతుడు తెగ బాధపడ్డాడు. బీఆర్‌ఎస్‌ నేతలు ఈడీ, సిబిఐల దెబ్బకి భయపడి కోట్ల రూకలు ప్రచారంపై ఖర్చు చేశారని ‘బాధ’పడ్డాడు. అవినీతి సామ్రాట్టుల భరతం పట్టేందుకే ఈడీ, సిబిఐలున్నాయట! ”నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు!” అంటే ఇదే కదా! మీపై కాలుదువ్వినవారిని ఒకరకంగాను, మీకు లొంగిపోయిన వారిపై మరొక రకంగా పైరెండు సంస్థల్నీ వినియోగించడం దేశం గమనిస్తూనే ఉంది కమలనాథులారా! 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణమో, ‘కోల్‌’గేట్‌ కుంభకోణం గురించో మోడీ పదే పదే చెపుతూ ఉంటారు. ఇలాంటి కుంభకోణాలు వ్యక్తులకో, పార్టీలకో సంబంధించినవి కావు. ఇవి విధానాలకు సంబంధించినవి. 2జి స్పెక్ట్రమ్‌ జరిగింది రాజా కోసమో, కనిమోళి కోసమో కాదు, అసలు ప్రయోజనం కలిగింది టాటాలకు, అంబానీలకు. బొగ్గు కుంభ కోణంలో ప్రధాన బెనిఫీషియరీలు జిందాల్‌ పైప్స్‌, టాటా స్టీల్స్‌ వంటివారు. ఉత్పత్తి చేసి, సరుకులు అమ్ముకుని లాభపడ్డ పెట్టుబడిదార్లు కాదు వీరు. ఆశ్రిత పెట్టుబడిదార్లు. వీరి దారేవేరు. పాలకులకు అంటకాగడం. భూలోకంలోనే కాదు, పాతాళంలో ఉండే బొగ్గు, ఆకాశంలో ఉండే స్పెక్ట్రమ్‌ వరకు అన్నింటినీ చేజిక్కించు కోవడం వీరి ఆనవాయితీ. మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీ, అంబానీ, టాటాల వంటి వారిని పోషించిన తీరు ప్రొఫెసర్‌ రామ్‌కుమార్‌ ఒక మాసపత్రికలో అద్భుతంగా వివరించారు. కేసీఆర్‌ చంద్రబాబుని తిట్టి, బీజేపీ కేసీఆర్‌ని శాపనార్థాలు పెట్టి, కొందరే అవినీతిపరులైనట్టు ప్రచారం చేసుకోవడం నిత్యకృత్యం. ఆ వ్యక్తులు పోతే అవినీతి పోతుందన్నట్లు ప్రచారం జరుగు తోంది. పివి కాలంలో నయా ఉదారవాద విధానాలు ప్రారంభ మైనాయి. యూరియా కుంభ కోణం, హర్షద్‌ మెహతా కుంభకోణం, కేతన్‌ పరేఖ్‌ కుంభకోణంతో ప్రారంభమైన పరంపర యెస్‌ బ్యాంకు కుంభకోణం, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌. కుంభకోణం, చందాకొచార్‌ నడిపిన కుంభకోణం వంటివి మోడీ కాలంలో కూడా నడుస్తూనే ఉన్నాయి కదా! ఇవేమైనా ఆగినాయా? మోడీవైపు వేలెత్తి చూపడానికి నియంత్రించబడ్డ మీడియా వెనకా ముందూ ఆడుతోంది గాని లేకుంటే అదానీ కుంభకోణం సామాన్యమైందా? కొన్ని పశ్చిమ దేశాల్లో అయితే ఈపాటికి ప్రభుత్వం రాజీనామా చేసి పోయేది. నోట్ల రద్దు ఒక భారీ కుంభకోణం, సహకార బ్యాంకుల కుంభకోణం అమిత్‌షా కోసమే నడిచింది. మోడీకి కుటుంబం లేకపోయుండచ్చు. ఆయనకు రహస్య బ్యాంకు అకౌంట్లు కూడా లేవేమో! ఆయన ఇప్పటిదాకా ఏ అవినీతి కేసుల్లో ఇరుక్కోలేదు కావచ్చు. ”నీ మిత్రుల గురించి చెప్పు, నేను నీ గురించి చెప్తాన”నే నానుడి మనకు తెల్సిందే. మోడీ పాలన మొదట్లోనే లలిత్‌ మోడీ, నీరవ్‌ మోడీ, విజరు మాల్యాలు కొన్ని నమూనా దిష్టిబొమ్మలే! ఆ సామ్రాజ్య గృహప్రవేశం చేస్తే లోపలి గదుల్లోని బీరువాల నుండి దొర్లి పడుతున్న అస్తిపంజరాలు ఎన్నో! బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి గబ్బు లేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ వ్యాపమ్‌ స్కాం స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ కనీవినీ ఎరగం. గుజరాత్‌, యూపీల్లో ఆక్సిజెన్‌ సిలెండర్ల స్కాం జనం ప్రాణాలే తీసింది కదా! ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది కాబట్టి ‘బారా ఖూన్‌ మాఫ్‌’ అందామా? కర్నాటకే అవినీతి పుట్ట అని ఆ రాష్ట్రం కోడై కూస్తోంది కదా! అవినీతి శిక్షించబడాల్సిందే. ప్రస్తుత వ్యవస్థలో అవినీతి రాచపుండు. వ్యవస్థని సమూలంగా పెకలించి వేయకుండా దాన్ని గోశాయి చిట్కాలతో మాన్చలేము.

Spread the love