వైభోవపేతంగా చెన్నకేశవ స్వామి కల్యాణోత్సవం..


– వెండి కిరీటాన్ని సమర్పించిన మంత్రి తల్లిదండ్రులు

నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో మంత్రి తన్నీరు హరీశ్ రావు స్వంత ఖర్చులతో నిర్మించిన ఆలయంలో చెన్నకేశవ స్వామి కల్లాణోత్సవాన్ని పురోహితులు నాదస్వర ధ్వనులు, ప్రత్యేక వేద మంత్రాలతో శనివారం వైభోవపేతంగా నిర్వహించారు. చెన్నకేశవ స్వామి కల్యాణోత్సవానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తల్లిదండ్రులు లక్ష్మిబాయ్ సత్యనారాయణ రావు ముఖ్య అతిథులుగా హజరై వెండి కిరీటాన్ని సమర్పించారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ మండల చేరికల కమిటీ చైర్మన్ బోయినిపల్లి శ్రీనివాస్, గ్రామస్తులు హజరయ్యారు.
మంత్రి తల్లిదండ్రులకు జెడ్పీటీసీ ఆత్మీయ సన్మానం..
తోటపల్లిలోని చెన్నకేశవ స్వామి కల్యాణోత్సవానికి ముఖ్య అతిథులుగా హజరైన మంత్రి హరీశ్ రావు తల్లిదండ్రులను జెడ్పీటీసీ కనగండ్ల కవిత దంపతులు శాలువా కప్పి ఆత్మీయ సన్మానం చేశారు. ఎంపీటీసీ నల్లగోండ లక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.