వెంపర్లాట


– గ్లోబల్‌ బ్రాండ్‌ బిల్డింగ్‌ కోసం మోడీ విదేశీ పర్యటనలు
– సామాజిక మాధ్యమాల్లో బీజేపీ అసత్య ప్రచారాలు
– ఎన్నికల్లో ఓటములను కప్పిపుచ్చుకునే యత్నం
ప్రధాని మోడీ అనేక పర్యటనలు, ప్రచారాలు చేసినా కర్నాటకలో అధికార బీజేపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ దెబ్బతో దక్షిణాదిలో బీజేపీ అడ్రస్‌ గల్లంతయ్యింది. దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంలోకి వద్దామన్న ఆలోచనలు సైతం ఇప్పుడు ఆ పార్టీలో సన్నగిల్లాయి. అయితే, కర్నాటక ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని సాక్షాత్తూ మోడీయే వచ్చి ప్రచారం చేసినప్పటికీ ఓటమి చెందటం బీజేపీకి జీర్ణం కావటం లేదా? బీజేపీ చెప్తూ వస్తున్న ‘మోడీ చరిష్మా, ప్రజాదరణ, జనాకర్షణ’ వంటివి ఉట్టి మాటలేనని ఈ ఎన్నికలు తేటతెల్లం చేశాయా? దీని నుంచి బయట పడేందుకే మోడీ విదేశీ పర్యటనలతో గ్లోబల్‌ బ్రాండ్‌ బిల్డింగ్‌ కోసం వెంపర్లాడు తున్నారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
2019 తర్వాత
పలు రాష్ట్రాల్లో ఓటములు
        స్వదేశంలోనే జనాదరణకు నోచుకోలేకపోతున్న మోడీ, దానిని అడ్డుకోవడానికే గ్లోబల్‌ బ్రాండ్‌ కోసం వెంపర్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 2019లో రెండోసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన మోడీ.. ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2019 నుంచి బీజేపీ పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, ఢిల్లీ వంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను గెలవలేకపోయిందని తెలిపారు. హర్యానా, మహారాష్ట్రలలో అధికారానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌కు సైతం బీజేపీ చేరుకోలేకపోయిందని వివరించారు. అందువల్ల విదేశాల్లో మోడీ ప్రజాదరణ అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారమంతా ‘మేడిపండు’ వంటిదేననీ, 2019 నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమే దీనిని రుజువు చేస్తున్నదని గుర్తు చేస్తున్నారు.
న్యూఢిల్లీ : కర్నాటక ఎన్నికల్లో చేదు ఫలితాలు, ప్రతిపక్షాల ప్రచారాలు రాబోయే 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీపై మరింత ప్రతికూల ప్రభావం చూపనున్నాయని కాషాయపార్టీ గ్రహించింది. దాని నుంచి ప్రజల దృష్టిని దారి మళ్లించేందుకు ప్రణాళికలు చేస్తున్నది. ఇందులో భాగమే ప్రధాని మోడీ ఇటీవల చేస్తున్న విదేశీ పర్యటనలు, వాటికి కల్పిస్తున్న విపరీత ప్రచారాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్నాటకతో పాటు ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన పలు ఎన్నికలలో ఓటమి విషయంలో మోడీ వైఫల్యాన్ని కప్పి పుచ్చే ప్రయత్నాలను బీజేపీ ముమ్మరం చేస్తున్నది. మోడీకి అంతర్జాతీయ ప్రజాదరణ ఉన్నదంటూ గ్లోబల్‌ బ్రాండ్‌ బిల్డింగ్‌ కోసం ప్రయత్నిస్తున్నది. ఈ పనిలో బీజేపీ, దాని అనుబంధ సంఘాలు, ఇతర సోషల్‌ మీడియా టీమ్‌లు తమ సామాజిక మాధ్యమాల ఖాతాలతో బిజీగా ఉన్నాయి. ఈ గ్లోబల్‌ బ్రాండ్‌ బిల్డింగ్‌ కోసం మోడీ సైతం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ మోడీ ఆటోగ్రాఫ్‌ను అడగటం, పాపువా న్యూ గినియా ప్రధాన మంత్రి జేమ్స్‌ మరాపే మోడీ పాదాలను తాకి స్వాగతించడం, ఆస్ట్రేలియన్‌ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌ మోడీని ప్రసిద్ధ రాక్‌స్టార్‌ బ్రూస్‌ స్ప్రింగ్‌స్టీన్‌తో పోల్చి ‘ది బాస్‌’ అని సంబోధించటం వంటివన్నీ ఈ ప్రహసనంలో భాగమే. వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను బీజేపీ ఐటీ పరివారం వైరల్‌ చేస్తూ మోడీ చరిష్మా తగ్గలేదని చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. రాన్ను రోజుల్లోనూ ఇందుకోసం మోడీ మరిన్ని విదేశాల్లో పర్యటించనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ జూన్‌ 22న వాషింగ్టన్‌ డీసీలో ఉంటారు. జులై14న ఫ్రాన్స్‌ ప్రెసిడెంట్‌ ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ను కలవడానికి, బాస్టిల్‌ డే పరేడ్‌లో పాల్గొనడానికి ఆయన ఆ దేశ రాజధాని పారిస్‌లో ఉంటారు. జూలై నెలాఖరులో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) నాయకులు, రష్యా, చైనా, ఇరాన్‌ అధ్యక్షులు, పలువురు మధ్య ఆసియా నేతలను మోదీ కలుస్తారు. ఆగస్టులో జరిగే బ్రిక్స్‌ సదస్సులో ప్రధాని మోడీ.. వ్లాదిమిర్‌ పుతిన్‌, జి జిన్‌పింగ్‌, బ్రెజిల్‌కు ప్రెసిడెంట్‌ లులా డా సిల్వా, దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్‌ రమఫోసాలను కలుస్తారు. అలాగే, సెప్టెంబర్‌ 9-10 తేదీలలో ఢిల్లీలో జీ20 సమ్మిట్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్నది.
ఈ విదేశీ పర్యటనల్లో, జీ20 సమావేశాల్లో ఆయా దేశాల ప్రధానులు, అధ్యక్షులతో సమావేశాలు, కరచాలనం, ముచ్చట్లు, వారి పొగడ్తలు వంటి ప్రతి సాధారణ విషయాన్నీ బీజేపీ అసాధరణ ప్రచారానికి అస్త్రాలుగా మలుచుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై దేశాధ్యక్షులు, ప్రధానుల పొగడ్తలు, కరచాలనాలు సర్వసాధారణమైన విషయమనీ, వీటిని భూతద్దంలో చూపిస్తూ మోడీని అంతర్జాతీయ నాయకుడు అంటూ బీజేపీ ఐటీ సెల్‌ ప్రచారం చేసుకుంటున్నదని అభిప్రాయపడ్డారు.

Spread the love