గ్రేటర్‌లోను భారీ వర్షాలు

– లోతట్టు ప్రాంతాలు జలమయం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరం తడిసి ముద్దైంది. లోతట్టు కాలనీలు, శివారు బస్తీ ప్రాంతాలు జలమయమయ్యాయి. అపార్టుమెంట్ల సెల్లార్లలోకి వరద నీరు పోటెత్తింది. డ్రయినేజీలు, మ్యాన్‌హౌల్స్‌ పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడగా, కవాడీగూడలో శిథిలావస్థకు చేరిన ఓ ఇల్లు కుప్పకూలింది. కూలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బేగంబజార్‌లోనూ పాత ఇండ్లు వర్షానికి నాని కూలిపోయాయి. రోడ్లన్నీ వర్షం నీటితో నిండటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మలక్‌పేట్‌, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, ఉప్పల్‌, రామాంతపూర్‌, అంబర్‌పేట్‌, నాంపల్లి, గన్‌ఫౌండ్రీ, మెహిదీపట్నం, లక్డీకాపూల్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎర్రగడ్డ, బేగంపేట్‌, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ, జేఎన్‌టీయూ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇదిలావుండగా టోలీచౌకీ మరోసారి నీటమునిగింది. నిజాం కాలనీ, మీరాజ్‌ కాలనీ ప్రాంతాలు జలమయం అయ్యాయి. అటు జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద భారీగా వరద నీరు నిలిచిపోయింది. కాగా, భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తెలిపారు. గురువారం కలెక్టర్‌ ఛాంబర్‌ నుంచి కలెక్టర్‌ జిల్లాలోని రెవెన్యూ అధికారులతో టెలీకాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నెంబర్‌ 040-23202813కు సమాచారం అందించాలన్నారు.