నవతెలంగాణ-హైదరాబాద్: భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. పాత భవనాలను అధికారులను ఖాళీ చేయిస్తున్నారు. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, ఇంజినీర్లు హాజరయ్యారు. వాటర్ లాగింగ్, చెట్లు విరిగిపోయాయని వస్తున్న ఫిర్యాదులు పరిష్కరించాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రోనాల్డ్ రాస్ హెచ్చరించారు. శిథిలావస్థకు చేరిన భవనాల్లో ప్రజలు ఉండకూడదని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆదేశించారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. హైదరాబాద్ నగరమంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వెళ్లేదారిలో రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. గచ్చిబౌలిలో ఉదయం అర గంట సమయంలోనే 13 మి.మీ. వర్షపాతం నమోదైంది. మియాపూర్‌లో 12.5 మి.మీ., జీడిమెట్లలో 11.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ రాత్రికి కూడా నగర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో నగర వాసులు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని సూచించింది.