అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలివ్వాలి

– పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇప్పించే వరకు
మా పోరాటం ఆగదు :ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-కోదాడరూరల్‌
అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలిచ్చి, ఇండ్లు కట్టించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఉదయం తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో మహబూబాబాద్‌లో ప్రారంభమైన బస్సు యాత్ర.. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చేరుకుంది. పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్‌లో సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్రకు ఘన స్వాగతం పలికారు. క్రాస్‌రోడ్‌లోని భగత్‌సింగ్‌ విగ్రహానికి ప్రజా సంఘాల రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌ వీరయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కోదాడ మండలంలోని కాపుగల్లు గ్రామంలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న వారి వద్దకు వెళ్లారు. గ్రామానికి చేరుకున్న యాత్ర బృందానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పద్మావతి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని రైస్‌ మిల్లు నుంచి గుడిసెలు వేసుకున్న ప్రాంతానికి ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న మక్క శ్రీను మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక్క నిముషం మౌనం పాటించారు. ఈ సందర్భంగా మల్లులక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు గతంలో పట్టాలిచ్చి హద్దులు కేటాయించలేదని విమర్శించారు. 5 ఏకరాల స్థలంలో ప్రకృతివనాలు, రైతు వేదికలు నిర్మించి పేదలకు అన్యాయం చేసిందని విమర్శించారు. పేదలు తాము నివాసం ఉంటున్న స్థలంలో వంటా వార్పు చేసుకుని జీవనం సాగించాలని కోరారు. గుడిసెలు వేసుకున్న గ్రామంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో గుడిసెవాసులు నిత్యం పాములు, తేళ్లు భయంతో బతుకుతున్నారని తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు విషయంలో పేద ప్రజలకు మొండిచేయి చూపిందని విమర్శించారు. మహిళలు పాల్గొన్న ప్రతి ఉద్యమం విజయం సాధించిందని, ఇండ్ల స్థలాల కోసం చేస్తున్న పోరాటంలోనూ మహిళలు అధికంగా పాల్గొంటున్నారని, వారి పోరాటమూ ఫలిస్తుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి. సాగర్‌, ఆర్‌. వెంకట్రాములు, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌ బాబు, వృత్తి సంఘాల రాష్ట్ర కార్యదర్శి ఆశయ్య, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వంగూరి రాములు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, జిల్లా ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love