గిరిజనులకు ఎంతకష్టం

– అత్యవసర వైద్యానికి జడికట్టి వాగు దాటించాల్సిదే
– జిన్నేలవాగు దాటిస్తున్న సీతారాం పురం  గిరిజనులు
నవతెలంగాణ.. వెంకటాపురం
తెలంగాణ ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం..వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటు ఏజన్సీలోని ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నాం ఇది పాలకులు చెపుతున్న మాట. అయితే గిరిజన గ్రామాల్లో అత్యవసరంగా వైద్యం అవసరమైతే వారుపడే పాట్లు అంతా ఇంత కాదు. సీతరంపురం గ్రామంలో వాంతులు, విరోచనాలతో బాబురావు మృతి చెందాడు. లక్ష్మయ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో సీతారాంపురం గ్రామస్తులు లక్ష్మయ్యను ఒక కర్రకు జోలీ కట్టి జిన్నెల వాగు దాటించాల్సిన పరిస్థితి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం భోదాపురం పంచాయతీలోని సీతారాంపురం గ్రామానికి చెందిన కురసం బాబురావు వాంతులు, విరోచనాలతో గురువారం మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన లక్ష్మయ్య వాంతులు, విరోచనాల కారణంతో ఇబ్బంది పడుతున్నాడు. లక్ష్మయ్యను అత్యవసర వైద్యం కోసం  ఎదిరలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలి. నాలుగు రోజులుగా మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా సీతారాంపురం నుండి అలుబాక మధ్యలో ఉన్న జిన్నెలవాగు  పొంగిపొర్లుతున్నాయి. వాగు వరకు ఎలాగోలా లక్ష్మయ్యను తరలించిన గ్రామస్థులు ఒక కర్రకు జోలీ కట్టి అందులో లక్ష్మయ్యను ఉంచి గ్రామస్తులు అంత వాగు దాటించారు. సీతారాంపురం గిరిజన గ్రామంలో ఇంటి కొకరు జ్వర పిడితులు ఉన్నట్లు గ్రామ స్థులు చెబుతున్నారు.