తీగలాగితే డొంక కదిలింది

– 49మంది అరెస్టు, న్యూజిలాండ్‌లో మరో నిందితుడు
– టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసులో ఛార్జ్‌షీట్‌ దాఖలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తీగలాగితే డొంక కదిలింది. మార్చ్‌ 11న హైదరాబాద్‌ బేగంబజార్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా, దాన్ని సీసీఎస్‌కు బదిలీ చేశారు. ప్రత్యేక బృందం సిట్‌ ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. ఈ కేసులో ఇప్పటివరకు 49 మందిని సిట్‌ అధికారులు అరెస్టు చేయగా, వీరిలో 18మంది మధ్యవర్తులుగా ఉన్నట్టు దర్యాప్తులో తేల్చారు. ఈ మేరకు సిట్‌ అధికారులు శుక్రవారం నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్టు విచారణలో తేలిందని ఛార్జీషీట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే నిందితులకు సంబంధించిన ఖాతా వివరాలు, చేతులు మారిన నగదు వివరాలను పొందుపర్చారు. మరింత సమాచారం కోసం మరికొంత మందిని అరెస్టు చేయాల్సి వుందన్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసిన మరో నిందితుడు ప్రశాంత్‌ న్యూజిలాండ్‌లో ఉన్నట్టు వెల్లడించారు. ఏఈఈ ప్రశ్నపత్రం లీకైన తర్వాత 13 మందికి, డీఏవో పేపర్‌ 8 మందికి, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నలుగురికి చేరాయని గుర్తించినట్టు తెలిపారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌ చేరిన నలుగురిలో టీఎస్పీఎస్సీలో పనిచేసే ముగ్గురు ఉద్యోగులుండగా, మరో వ్యక్తి బయటివాడని వివరించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలోనే ఉన్నట్టు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇటీవల అరెస్టయిన డీఈ పూల రమేష్‌ సహకారంతో ఏఈ, డీఏవో పరీక్షల్లో చూసిరాతకు పాల్పడిన ముగ్గుర్ని అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలను రామంతాపూర్‌లోని సెంట్రల్‌ ఫోరెనిక్స్‌ సైన్స్‌ లాబోరేటరికి పంపించినట్టు తెలిపారు. వాటిని విశ్లేషిస్తున్న క్రమంలో మరికొంత సమాచారం బయటికి వచ్చినట్టు వెల్లడించారు. డీఈ రమేష్‌ ఏఈఈ ప్రశ్నపత్రాన్ని మరికొంత మందికి విక్రయించినట్టు సిట్‌ అధికారులు భావిస్తున్నారు. ఏ-1గా పీ.ప్రవీణ్‌కుమార్‌ (ఏఎస్‌ఓ)గాను, ఏ-2గా అట్లా రాజశేఖర్‌(నెల్‌వర్క్‌ అడ్మినిస్ట్రేషన్‌),ఏ-3గా రేణుఖా రాథోడ్‌, ఏ-4గా ఎల్‌.ధాక్యా, ఏ-5గా కేతావత్‌ రాజేశ్వర్‌, ఏ-8గా కేతావత్‌ శ్రీనివాస్‌, ఏ-9 కేతావత్‌ రాజేందర్‌ నాయక్‌తోపాటు పలువురిపై కేసులు నమోదు చేసినట్టు ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చారు. ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. కేసు దర్యాప్తులో తేలే మిగతా నిందితులను బట్టి అనుబంధ అభియోగపత్రాలను దాఖలు చేయాలని భావిస్తున్నట్టు సిట్‌ అధికారులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

Spread the love