ఫేట్‌ గేమ్‌ ఆడితే..?

నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌ నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా ‘సర్కిల్‌’. సాయిరోనక్‌, బాబా భాస్కర్‌, అర్షిణ్‌ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించారు. ఆరా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎమ్‌వీ శరత్‌చంద్ర, టి.సుమలత అన్నిత్‌ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు నీలకంఠ మీడియాతో ముచ్చటించారు.
‘ఫేట్‌ (విధి) అనే కాన్సెప్ట్‌తో ఓ వందమందిని ఓ సర్కిల్‌లోకి తీసుకొచ్చి.. ఎట్లా వారి జీవితాలను అల్లకల్లోలం చేసిందని మెయిన్‌ థీమ్‌.. ఇది రొమాంటిక్‌,
క్రైమ్‌ థ్రిల్లర్‌ కాదు. ఇన్వెస్టిగేషనల్‌ టైప్‌లో కాకుండా.. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా రన్‌ చేశాం. ఇందులో సాయిరోనక్‌ ఫొటో గ్రాఫర్‌గా కనిపిస్తాడు. అన్‌ హ్యూమన్‌ సర్కిల్‌లోకి అతన్ని ఎలా లాగబడ్డాడు? అక్కడి నుంచి కథ రివీల్‌ అవుతుంది. రొమాంటిక్‌ యాంగిల్‌ కూడా జత చేశాం. ముగ్గురు హీరోయిన్లు ఇంపార్టెంట్‌ రోల్స్‌ ప్లే చేశారు. నా గత సినిమాల్లో మాదిరే హీరోయిన్స్‌కు ఈ మూవీలో కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. బాబా భాస్కర్‌ క్యారెక్టర్‌ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఫస్ట్‌ టైమ్‌ ఓ కీలక పాత్రలో నటించారు. నేను కాన్సెప్ట్‌ మీదే ఎక్కువగా వర్క్‌ చేస్తా. కుదిరితే త్వరలో స్టార్‌ హీరోలతో కూడా సినిమాలు చేస్తా. ఈ సినిమాలో కాన్సెప్ట్‌తోపాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను కూడా చూపించాం’ అని అన్నారు.

Spread the love