ఐకేపీ వీఓఏల సమస్యలను పరిష్కరించాలి

 – సమ్మె నివారణకు చొరవ తీసుకోవాలి
–  సీఎం కేసీఆర్‌కు సీఐటీయూ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఐకేపీ వీఓఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ, నిరవధిక సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రికి వారు బహిరంగ లేఖ రాశారు. ‘రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో గ్రామ స్థాయిలో 17,606 మంది వీఓఏలు(గ్రామ సంఘాల సహాయకులు) పని చేస్తున్నారు. 19 ఏండ్ల నుంచి మహిళలు ఆర్థికంగా ఎదిగేలా, సామాజికంగా చైతన్యం పొందేలా కృషి చేస్తున్నారు. చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రభుత్వం ద్వారా లోన్స్‌ ఇప్పిస్తున్నారు. తిరిగి ఆ రుణాలను సక్రమంగా చెల్లించే విధంగా ప్రోత్సహిస్తున్నారు. డ్వాక్రా మహిళా సంఘాలు నిర్వహిస్తున్న లావాదేవీలన్నీ పుస్తక నిర్వహణ చేస్తూ ఎస్‌హెచ్‌జి లైవ్‌ మీటింగ్‌ పెట్టి అన్ని సంఘాలు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తున్నారు. ఈ పనులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇంత శ్రమిస్తున్నా ఐకేపీ వీఓఏలకు సెర్ప్‌ నుంచి రూ.3,900 గౌరవ వేతనమే చెల్లిస్తున్నారు. ఇటీవల సర్వేలతో వారిపై మరింత భారం పెరిగింది. అతి తక్కువ వేతనం బతకడం వారికి కష్టంగా మారింది. వారి సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు యూనియన్లు, కార్మిక సంఘాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చినప్పటికీ పనికి తగిన గుర్తింపు గానీ, శ్రమకు తగిన వేతనం గానీ లభించడం లేదు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న వీఓఏలతో ప్రభుత్వ చర్చలు జరపాలి. వారిని ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి. రూ.10 లక్షల సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. ఐడీ కార్డులివ్వాలి. అర్హులైన వీఓఏలను సీసీలుగా ప్రమోషన్స్‌ కల్పించాలి. యూనిఫామ్‌ ఇవ్వాలి’ అని లేఖలో కోరారు.

Spread the love