ఉద్యోగులకు పాత పెన్షన్‌ను అమలు చేయండి

–  సీఎం కేసీఆర్‌కు కూనంనేని లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 2004కు ముందు ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు విడుదలై ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న వారందరికీ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. దేశంలో నూతన పెన్షన్‌ విధానంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004, సెప్టెంబర్‌ ఒకటి తర్వాత నియామకమైన ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం (సీపీఎస్‌) అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఉద్యోగులను బలవంతంగా ఈ కొత్త పెన్షన్‌ విధానంలోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. దీంతో చాలా మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వివరించారు. అయితే 2004, సెప్టెంబర్‌ ఒకటి కంటే ముందే ఉద్యోగ, ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికైన వారు పాత పెన్షన్‌ విధానం కోసం వేచిచూస్తున్నారని తెలిపారు. మెమోనెంబర్‌ 57/05/2021 పి అండ్‌ పిడబ్ల్యూ 2023, మార్చి మూడో తేదీన కేంద్రం విడుదల చేసిన మెమో ప్రకారం 2003, డిసెంబర్‌ 12 నాటికి నోటిఫికేషన్‌ విడుదల చేయబడిన వారందరినీ పాత పెన్షన్‌ విధానంలోకి తేవాలంటూ ఆదేశాలిచ్చిందని గుర్తు చేశారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా 2004కు ముందు నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగాలు పొందిన వారికి పాతపెన్షన్‌ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు.

Spread the love