భారత్ 438 ఆలౌట్..విండీస్ 86/1

నవతెలంగాణ-హైదరాబాద్ తొలి టెస్టులో భారత బౌలర్ల ధాటికి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తక్కువ స్కోరుకే ఆలౌటై ఇన్నింగ్స్‌ తేడాతో చిత్తుగా ఓడిన విండీస్‌.. రెండో టెస్టులో మాత్రం ప్రతిఘటిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 86/1 స్కోరుతో నిలిచింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (37*), మెకంజీ(14*) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ ఇంకా 352 పరుగుల వెనుకంజలో ఉంది. ఓవర్‌ నైట్‌ స్కోరు 288/4తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. మొదటి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. భారత్ ఆలౌటైన తర్వాతి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఓపెనర్లు బ్రాత్‌వైట్, త్యాగ్‌నారాయణ్‌ చందర్‌పాల్ (33) శుభారంభం అందించారు. ఆరంభంలో బ్రాత్‌వైట్ నిలకడగా ఆడాడు. తొలుత నెమ్మదిగా ఆడిన త్యాగ్‌నారాయణ్ తర్వాత బౌండరీలు బాదాడు. అశ్విన్‌ వేసిన వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతడు.. సిరాజ్‌ బౌలింగ్‌లోనూ బంతిని రెండుసార్లు బౌండరీ దాటించాడు. కొద్దిసేపటికే జడేజా బౌలింగ్‌లో త్యాగ్‌నారాయణ్‌.. అశ్విన్‌కు చిక్కాడు. దీంతో 71 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన మెకంజీ ఓ సిక్స్‌, ఫోర్ బాదాడు. ఈ క్రమంలోనే రెండో రోజు ఆటను ముగించారు.