విద్యాసంస్థలకు నేడూ సెలవు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారీ వర్షాల నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం కూడా సెలవు ఉంటుందని స్పష్టం చేసింది. శుక్ర, శనివారాలు రెండురోజులపాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వైద్యం, పాల సరఫరా తదితర అత్యవసర సేలవు కొనసాగుతాయని తెలిపారు. ప్రయివేటు సంస్థలు కూడా వాటి కార్యాలయాలకు సెలవులు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖను సీఎం ఆదేశించారు. అయితే గురువారం ఉదయం పిల్లలు, ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లాక మంత్రి సబిత ఉదయం 8.30 గంటలకు సెలవులు ప్రకటించడం గమనార్హం. ఈ నిర్ణయంపై సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వర్షాల కారణంగా బుధవారం రాత్రి లేదంటే గురువారం ఉదయం ఎనిమిది గంటల్లోపే సెలవులు ప్రకటిస్తే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకోవైపు గురు, శుక్రవారాల్లో రెండు రోజులపాటు ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ విద్యాసంస్థలన్నింటికీ సెలవు లుంటాయన్న ఆదేశాలను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం సాయంత్రం ఏడు గంటలకు విడుదల చేశారు. దీనిపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం బడులకు వెళ్లాక సెలవుంటుందని ప్రకటించడం, బడులు ముగిసి ఇంటికి వచ్చాక ఆదేశాలు జారీ చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో రెండురోజులపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.