అది ఉగ్రవాద సంస్థ కాదు

– ‘సనాతన్‌ సంసాoపై బాంబే హైకోర్టు వ్యాఖ్యలు
– ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడం దాని లక్ష్యమని వెల్లడి
ముంబయి : ప్రముఖ హేతువాదులు నరేంద్ర దబోల్కర్‌, ఎం.ఎం కలబురగి, గోవింద్‌ పన్సారే, జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్య కేసులో కీలక పాత్ర పోషించిందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న హిందూత్వ సంస్థ సనాతన్‌ సంస్థాపై బాంబే హైకోర్టు ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద సనాతన్‌ సంస్థా అనేది ఉగ్రవాద సంస్థ కాదని వ్యాఖ్యానించింది. సమాజంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచే లక్ష్యంతో చారిటబుల్‌ ట్రస్టుగా ఇది నమోదైందని న్యాయస్థానం తెలిపింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు విజరు లోధికి బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ సునీల్‌ శుక్రే, కమల్‌ ఖటలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ పై విధంగా అభిప్రాయపడింది.
లోధి సనాతన్‌ సంస్థా క్రియాశీలక సభ్యుడు. మహారాష్ట్ర, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉగ్రవాద ముఠాను రహస్యంగా ఏర్పర్చడం ద్వారా హిందూ దేశాన్ని ఏర్పాటు చేయాలన్నది సదరు హిందూత్వ సంస్థ లక్ష్యం. లోధి దేశాన్ని అస్థిరపర్చే కుట్రలో భాగమయ్యాడని మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్‌) ఆరోపించింది. హిందూత్వ సంస్థ కోసం తన ఇంటిలో ఆయుధాలు, పేలుడు పదార్థాల తయారీతో పాటు వాటిని నిల్వ చేశాడన్న ఆరోపణలపై ఏటీఎస్‌ ఆయనను అరెస్టు చేసింది. కాగా, బాంబే హైకోర్టుకు ముందు ప్రత్యేక కోర్టు లోధి దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది.

Spread the love