ఓట్ల కోసమే…

– బీజేపీ తెరపైకి కామన్‌ సివిల్‌ కోడ్‌ : టీపీసీసీ అధికార ప్రతినిధి కృష్ణతేజ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్లు దండుకునేందుకే కామన్‌ సివిల్‌ కోడ్‌ను తెరపైకి తెచ్చిందంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి కృష్ణతేజ విమర్శించారు. అది స్వచ్చంగా ఉండాలే కానీ తప్పనిసరి కాదని 21వ లా కమిషన్‌ చెప్పిందని గుర్తు చేశారు. దీని అమలు చేయాలంటే భవిష్యత్తులో అందర్ని కలుపుకునిపోవాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సూచించారని తెలిపారు. బుధ వారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో అధికార ప్రతినిధులు శ్రీరంగంసత్యం, కల్వసుజాతతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రధాని నీతులు చెప్పడమే తప్ప బీజేపీ నేతలను కట్టడి చేయడం లేదని విమర్శించారు. కేంద్ర హోంమంత్రి కుమారుడు జై షా, ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ ప్రవర్తన వివాదమవుతున్నా…బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట కవిత విషయంలోనూ బీజేపీ సర్కారు చర్యలు తీసుకోవడం లేదన్నారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ…తెలంగాణలో అసలు సమస్యలే లేవన్నట్టు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని భూ నిర్వాసితుల సమస్యలపై చర్చకు వస్తారా? అని సవాల్‌ విసిరారు. పేపర్‌ లీకేజీ విషయంలోనూ మంత్రి కేటీఆర్‌ అతి తేలివిగా మాట్లాడి తన చాణక్యనీతి ప్రదర్శించారని ఎద్దేవా చేశారు.

Spread the love