పేపర్‌ బాయ్‌కు కేరళ సాహిత్య అకాడమీ అవార్డు..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఉదయం వార్తపత్రికలు పంపిణీ చేస్తూ, రాత్రివేళ నదీతీరంలో ఇసుకను తీసే పొక్లెయిన్‌ ఆపరేటరుగా పనిచేసే 28 ఏళ్ల కె.అఖిల్‌కు కేరళ సాహిత్య అకాడమీ వార్షిక అవార్డు-2020 వరించింది. అఖిల్‌ రాసిన పొట్టి కథల పుస్తకం ‘‘నీలచడయాన్‌’’కు ఈ అవార్డు ప్రకటించారు. ఇడుక్కి జిల్లాలో పెరిగే గంజాయి జాతి మొక్కల స్ఫూర్తితో తన పుస్తకానికి ఈ పేరు పెట్టారు. ఉత్తర కేరళలోని సామాన్య ప్రజల జీవితాలను ఇందులోని కథలు ప్రతిబింబిస్తాయి. నృత్యం, మూకాభినయం, సంగీతాలను సాధన చేసే తెయ్యం కళాకారుల కష్టాలను కథలుగా మలిచారు. ఈ సందర్భంగా అఖిల్‌ తన సంతోషం వ్యక్తం చేస్తూ ఇలాంటి గుర్తింపును ఊహించలేదన్నారు. కుటుంబ బాధ్యతల కారణంగా ప్లస్‌టూతోనే చదువు మానుకొని కుటుంబానికి చేదోడుగా నిలవాల్సి వచ్చిందని తెలిపారు. ‘నీలచడయాన్‌’’ ముద్రణకు మొదట్లో నాలుగేళ్లు ప్రచురణకర్తల చుట్టూ అఖిల్‌ తిరిగారు. చివరకు ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటన చూసి పుస్తక ముద్రణకు రూ.20 వేలు పోగు చేయాల్సి వచ్చింది. తాను పొదుపు చేసుకొన్న రూ.10 వేల సొమ్ముకు తోడు తన తల్లి కూలి డబ్బులు రూ.10 వేలు కలిపితే కానీ, ఆ కల సాకారం కాలేదు. అదీ ఆన్‌లైన్‌ విక్రయాలకు మాత్రమే. అయినా పెద్దగా స్పందన లేకపోయింది. ప్రముఖ మలయాళ సినీ రచయిత బిపిన్‌ చంద్రన్‌ ‘‘నీలచడయాన్‌’’ కథలను ప్రశంసిస్తూ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుతో పుస్తక దుకాణాల్లో దీని గురించి అందరూ అడగటం మొదలుపెట్టారు. అఖిల్‌ పుస్తకం ఇపుడు ఎనిమిదో ముద్రణకు వెళ్లడం విశేషం.

Spread the love