రైతు నుంచి లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డ ల్యాండ్‌ సర్వేయర్‌ ఏడీ,

– సూపరింటెండెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌
నవతెలంగాణ-నిజామాబాద్‌ సిటీ
భూమి నాలా కన్వర్షన్‌ చేసిన తర్వాత పంచనామ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి లంచం తీసుకుంటూ ల్యాండ్‌ సర్వేయర్‌ ఏడీ, సూపరింటెండెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కారు. నిజామాబాద్‌లోని సమీకృత కలెక్టర్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం వలపన్ని వారిని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మోర్తాడ్‌ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన రాజేందర్‌ అనే రైతుకు సంబంధించిన భూమి నాలా కన్వర్షన్‌ చేసిన తర్వాత పంచనామ సర్టిఫికెట్‌ కోసం కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. సర్టిఫికెట్‌ కోసం జూనియర్‌ అసిస్టెంట్‌ రహీమా, సూపరింటెండెంట్‌ వెంకటేశ్‌ రూ|| 5000 తీసుకున్నారు. ఏడీకి మరో రూ.10వేలు ఇస్తేనే సర్టిఫికెట్‌ ఇస్తామని చెప్పడంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం రూ.10వేలు ఏడీ శ్యామ్‌ సుందర్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ముగ్గురిని విచారణ చేసి కరీంనగర్‌కు పంపినట్టు ఏసీబీ డీఎస్పీ, సీఐ శ్రీనివాస్‌, నాగేష్‌ తెలిపారు.
8 నెలల క్రితమే పోస్టింగ్‌.. గతంలోనూ అనేక అక్రమాలు
సంగారెడ్డి జిల్లాకు చెందిన శ్యాం సుందర్‌రెడ్డి గతంలో మహబూబ్‌నగర్‌లో పనిచేసినప్పుడు అనేక ఆరోపణలు వచ్చాయి. దాంతో అక్కడి కలెక్టర్‌ ఆయన్ను సరెండర్‌ చేశాడు. నిజామాబాద్‌లో ఏడీ పోస్టు ఖాళీ కావడంతో ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నించగా.. అప్పటి కలెక్టర్‌ నారాయణరెడ్డి తిప్పి పంపారు. చివరకు కమిషనర్‌ సిఫారసుతో 8 నెలల క్రితం వచ్చి జాయిన్‌ అయ్యారు. అప్పటి నుంచి రైతులను ఇబ్బందులు పెడుతూనే ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల మంత్రి వేములతో సైతం చివాట్లు తిన్నట్టు సమాచారం. చివరాఖరకు రైతు ఫిర్యాదుతో ఏసీబీకి చిక్కి కటకటాలపాలయ్యారు.

Spread the love