ఐసీడీఎస్‌ను మూసేసే కుట్రను తిప్పికొడదాం

– సమగ్ర శిశు, స్త్రీ సంక్షేమానికి గండి
– మోడీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థల ధ్వంసం
– జులై 10న బ్లాక్‌డే.. పాదయాత్ర.. నిరసనలు
– సంస్థ పరిరక్షణ.. సమస్యల పరిష్కారానికి సమరశీల ఉద్యమాలు: చుక్క రాములు
– సంగారెడ్డికి చేరిన అంగన్‌వాడీ జీపుజాత
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
సమగ్ర శిశు, స్త్రీ సంక్షేమానికి గండికొట్టేందుకు జరుగుతున్న కుట్రలను ఛేదించేందుకు సమరశీలంగా ఉద్యమించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. ‘ఐసీడీఎస్‌ పరిరక్షణ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం’ కోసం అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జీపుజాత బుధవారం సంగారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించిన సభకు అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చుక్క రాములు మాట్లాడుతూ.. మోడీ తొమ్మిదేండ్ల పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వేలు, విమానయానం, పోర్టులు, రోడ్లు, మైదానాలు, ఎల్‌ఐసీ వంటి సంస్థలను ధ్వంసం చేసి కార్పొరేట్‌ శక్తులకు లాభాలు పోగేసే పని మాత్రమే జరిగిందన్నారు. సమగ్ర శిశు, స్త్రీ సంక్షేమానికి పెద్ద పీట వేయడం ద్వారా భావితరాలకు పోషకాహారలోపం లేకుండా చూడాలనే సదుద్దేశంతో నెలకొల్పిన ఐసీడీఎస్‌ సంస్థకు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులివ్వకుండా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్ని స్తున్నదని విమర్శించారు. అంగన్‌వాడీలకు ఎందుకు గ్రాట్యుటీ చెల్లించడం లేదని ప్రశ్నించారు. 2013లో జరిగిన ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ అంగన్‌వాడీలను కూడా కార్మికులుగా గుర్తించి గ్రాట్యుటీ, కనీస వేతనం, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వంటి సదుపాయలు కల్పించాలని సిఫార్సు చేసినా పాలకులు అమలు చేయడంలేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడు తున్నామని చెప్పుకునే సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హారీశ్‌రావు.. అంగన్‌వాడీల సమస్యల్ని పరిష్కరించకపోతే బీజేపీకి బీఆర్‌ఎస్‌కు తేడా ఏముంటదని ప్రశ్నించారు. రాబోయే కాలంలో ఐసీడీఎస్‌ పరిరక్షణ, జీతభత్యాల కోసం అంగన్‌వాడీ ఉద్యోగులు సమరశీలంగా ఉద్యమాలు చేయాలని కోరారు.
అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మీ మాట్లాడుతూ.. ఐసీడీఎస్‌ ప్రాజెక్టుకయ్యే ఖర్చుల్ని వంద శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం నిధుల్ని తగ్గించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేస్తుందన్నారు. నూతన విద్యా విధానం అమలైతే ఐసీడీఎస్‌ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు. అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేసిందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. టీఏ, డీఏ లివ్వడంలేదన్నారు. జీతాలు పెంచామంటూ గొప్పలు చెప్పుకునే బీఆర్‌ఎస్‌ మంత్రులు తమిళనాడు మాదిరి ఇక్కడ అంగన్‌వాడీలను ఉద్యోగులుగా ఎందుకు గుర్తించడంలేదని ప్రశ్నించారు. కర్నాటకలో గ్రాట్యుటీ ఇస్తుంటే తెలంగాణలో ఎందుకివ్వరన్నారు. కేరళ, బెంగాల్‌లో ఏటా బోనస్‌ ఇస్తుంటే తెలంగాణలో ఎందుకు అమలుకావడంలేదన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే. మల్లిఖార్జున్‌ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ యూనియన్‌కు ఎన్నో సమరశీల పోరాటాలు చేసిన చరిత్ర ఉందని, ప్రభుత్వం, అధికారులు ఎన్ని నిర్భందాలకు గురి చేసినా భయపడేది లేదన్నారు. జులై 10న దేశ్యాప్తంగా కోరికల దినం సందర్భంగా యూనియన్‌ ఆధ్వర్యంలో నల్లచీరలు ధరించి నిరసన ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి సునీత, రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సమ్మ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షకార్యదర్శులు శశికళ, మంగమ్మ, సీఐటీయూ జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love