మణిపూర్‌ సీఎంను మార్చాలి

– తిరుగుబాటు దళాలను నిరాయుధులను చేయాలి : జాతీయ కన్వెన్షన్‌ తీర్మానం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
”పక్షపాతంతో వ్యవహరిస్తున్న మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ నిష్క్రియంగా ఉన్నారు. ఆయనను తన పదవి నుంచి తొలగించాలి” అని జాతీయ కన్వెన్షన్‌ తీర్మానించింది. ఢిల్లీలోని హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ భవన్‌లో మణిపూరి సమాధావన్‌తో జరిగిన సదస్సులో కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, జేడీయూ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఎన్సీపీ, ఆప్‌, ఆర్‌ఎస్‌పీ, శివసేన (ఉదవ్‌ ఠాక్రే), టీఎంసీ పార్టీలు పాల్గొన్నాయి. తిరుగుబాటు సాయుధ దళాల నిరాయుధీకరణ లేకుండా శాంతి సాధ్యం కాదని కూడా కన్వెన్షన్‌ పేర్కొంది.మణిపూర్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత ఓక్రమ్‌ ఇబోబి సింగ్‌ శనివారం హౌంమంత్రి అమిత్‌ షా పిలిచిన అఖిలపక్ష సమావేశం ఒక ప్రహసనమని, మాట్లాడటానికి ఐదు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న మణిపూర్‌ రాష్ట్రంలో వందలాది మంది చనిపోతున్నా ప్రధాని మౌనం దిగ్భ్రాంతికరమని అన్నారు. ప్రధానిని కలిసేందుకు ప్రతినిధుల బృందం పది రోజులకుపైగా ఢిల్లీలో వేచి ఉందని, అమిత్‌ షా పర్యటన తరువాత కూడా హింస పెరుగుతోందని అన్నారు.సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు నీలోత్పల్‌ బసు మాట్లాడుతూ రాజ్యాంగ ఆదేశాన్ని నెరవేర్చడంలో ప్రధాని నరేంద్ర మోడీ విఫలమయ్యారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మణిపూర్‌లో అశాంతి నెలకొందని, బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని బసు అన్నారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ మాట్లాడుతూ మణిపూర్‌ రాజకీయ విపత్తు అని ఆరోపించారు. ప్రజలు సామాజిక, మానవ హక్కుల క్షీణతను ఎదుర్కొంటున్నారని అన్నారు. అఖిలపక్ష బృందాన్ని పంపాలన్న సిఫారసును కూడా అమిత్‌ షా తిరస్కరించారని విమర్శించారు. తక్షణమే అందరి విశ్వాసంతో చర్చ జరగాలని, ప్రజలు ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటే మార్చాలని అన్నారు. శాంతిని నెలకొల్పడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు.వివాదాన్ని అదుపు చేసేందుకు సిద్ధంగా లేని ప్రధాని బాధ్యత ఏమిటని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశ్నించారు. పుల్వామా తరహాలోనే మణిపూర్‌ వివాదం కూడా రాజకీయ లబ్ది పొందేందుకు మరో ప్రయత్నమేనని పేర్కొన్నారు. ఫార్వర్డ్‌ బ్లాక్‌ ప్రధాన కార్యదర్శి జి దేవరాజన్‌, జేడీయూ ఎంపీ అనిల్‌ హెడ్గే, ఆర్‌ఎస్‌పీ జాతీయ సెక్రెటేరియట్‌ సభ్యుడు ఆర్‌ఎస్‌ ధాగర్‌ కూడా మాట్లాడారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు హన్నన్‌ మొల్లా, సీపీఐ(ఎం) మణిపూర్‌ రాష్ట్ర కార్యదర్శి క్షేత్రమయుం ఎస్‌ శాంత, మణిపూర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కె. మేఘచంద్ర సింగ్‌, సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎల్‌. సోతిన్‌కుమార్‌ సింగ్‌, జేడీయూ అధ్యక్షుడు బీరెన్‌ సింగ్‌ పాల్గొన్నారు.

Spread the love