బహుముఖ ప్రతిభాశాలి మరింగంటి భట్టరాచార్యులు

మరింగంటి భట్టరాచార్యులు…
విద్యావేత్త, సాహితీకారులు, సంగీత విద్వాంసులు, బహుభాషా కోవిదులు, సంఘ సేవకులు, పేదల పాలిట పెన్నిధి, స్వాతంత్ర సమరయోధులు, రేడియో, టీవీ కళాకారులు… ఇలా ఎన్నో రంగాలలో ఓ ధృవతారలా వెలిగిపోయినవారు. ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో 1930 సెప్టెంబర్‌ 28న రంగాచార్యులు, వీర రాఘవమ్మ దంపతులకు జన్మించారు. తర్వాత కాలంలో కృష్ణా జిల్లా తిరువూరు వలస వెళ్ళారు. విశ్వనాథ సత్యనారాయణ దగ్గర శిష్యునిగా చేరి చదువు ప్రారంభించారు.
చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకోవడంతో పేదరికం వల్ల ఈయన చదువులో కాస్త వెనకబడ్డారు. అటువంటి సమయంలో పెద్ద అన్న మరింగంటి సీతారామాచార్యులు వీరి చదువుకు అండగా నిలిచారు. హిందీలో విశారద పట్టా పుచ్చుకున్నారు. అలాగే సంస్కృతంలో ఉన్నత విద్యను అభ్యసించారు. తర్వాత రంగ నాయకమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. వీరిలో డాక్టర్‌ మరింగంటి మురళీకృష్ణ జర్నలిస్టుగా, సాహితీవేత్తగా భాసిల్లుతున్నారు.
భట్టరాచార్యులు సాహిత్యంలో అనేక ప్రక్రియల్లో నిష్ణాతులు. పరిశోధనాత్మక వ్యాసాలు, అనువాద రచనలు, పద్యాలు, కవితలు, కథానికలు, లలిత గీతాలు, ధారావాహికలు, అష్టాదశ ప్రవచనాలు పాఠకులకు అందించారు. వీరికి తెలుగు, సంస్కృతం, హిందీ, అరబిక్‌, ఉర్దూ, పర్షియన్‌ భాషల్లో మంచి పాండిత్యం ఉంది. విశ్వనాథ వారి కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్లి కావ్యాలను ”కిన్నెరోంకి గీత్‌ ఔర్‌ కోయల్‌ కి షాదీ” పేరుతో హిందీలోకి అనువదించారు. ప్రముఖ హిందీ నవలా రచయిత మోహన్‌లాల్‌ మహత్తు వియోగి నవల ‘ఆర్యవర్త్‌’ను ‘ఆర్యవర్తం’ పేరుతో తెలుగులోకి అనువదించారు. జయశంకర్‌ ప్రసాద్‌ కావ్యం ‘అంశు’ను ‘అశ్రుబిందు’గా తెలుగులోకి అనువదించారు. వీరు రాసిన ప్రముఖ గ్రంథాలు కథానాయకుడు, మన గాంధీ, శ్రీమద్‌ భగవద్గీతాసారం, తిరుప్పావై ప్రవచనాలు, కబీర్‌, వేమన తులనాత్మక అధ్యయనం, విశ్వనాథ వారి కవితా వైభవం ప్రసిద్ధి చెందినవి. విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం, తులసీదాసు రామచరిత మానస్‌లను అధ్యయనం చేసి కృష్ణప్రభ అనే పత్రికలో పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు. యూజీసీ వారు రామానుజ వేదాంతంపై వీరితో వీడియో ఉపన్యాసాలు చేశారు. ఈ ఉపన్యాసాలు దేశవ్యాప్తంగా చక్కని గుర్తింపు తెచ్చిపెట్టాయి. దూరదర్శన్‌లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆస్ట్రేలియా నుంచి వెలువడిన ‘తెలుగు పలుకు’ పత్రికలో అప్పట్లో ఎన్నో సాహితీ, ధార్మిక వ్యాసాలు రాశారు. ఢిల్లీ నుంచి వెలువడే ‘తెలుగు వాణి’లో కూడా లెక్కకు మిన్నగ వ్యాసాలు రాశారు. ఆకాశవాణి హైదరాబాద్‌, విజయవాడ, కొత్తగూడెం కేంద్రాలలో అనేక గీతాలు రాశారు.
బెజవాడ గోపాల్‌ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, ఎర్నేని సుబ్రహ్మణ్యం, అనంతశయనం అయ్యంగార్‌, ప్రకాశం పంతులు సాహచర్యంతో ఆచార్య వినోబా భావే నేతృత్వంలో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. స్త్రీ విద్య, గ్రామ పారిశుధ్యం, ఖద్దరు వస్త్రాల వినియోగం, రాట్నం వడకటం, హరిజనులకు దేవాలయాల ప్రవేశం లాంటి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇంకా ఖమ్మం జిల్లా గార్ల కేంద్రంగా నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు.
భట్టరాచార్యుల వారు ”పండిత, సాహిత్య భూషణ, ప్రవచన దిట్ట….” లాంటి వందకు పైగా పురస్కారాలను సొంతం చేసుకుని వాటికే వన్నె తెచ్చారు. అపారమైన జ్ఞాన సంపదతో అందరి మదిలో నిలిచిపోయిన మరింగంటి భట్టరాచార్యులవారు 2012 జూలై 18న తుదిశ్వాస విడిచారు.
– పింగళి భాగ్యలక్ష్మి, 9704725609

Spread the love