అసోంలో వరదలు..పలువురు మృతి

గువహతి : అసోంలో కురిసిన కుండపోత వర్షాలకు రోడ్లు ఏరుల్ని తలపిస్తున్నాయి. నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహించడంతో వేలాది గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఇక లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులై కొండలు, గుట్టల మీద తలదాచుకుంటున్నారు. గత కొన్నిరోజులుగా అసోం వరదలు ముంచెత్తుతున్నా, రోజులు గడుస్తున్నా.. ఆ వరద ప్రవాహం మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం 19 జిల్లాలు వరద ప్రభావిత జిల్లాలుగా ఉన్నాయని అస్సాం స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎస్‌డీఎంఎ) శనివారం వెల్లడించింది. ప్రస్తుతం అసోం ఇంకా దయనీయ పరిస్థితుల్లోనే ఉందని ఎస్‌డీఎంఎ పేర్కొంది. ఈ వరదలకు రెండు పట్టణ ప్రాంతాల్లో దాదాపు 4,88,525 మంది, 1,538 గ్రామాలు నీటమునిగాయని ఎస్‌డీఎంఎ నివేదిక తెలిపింది.
కాగా, ఈ వరదల కారణంగా గురువారం తాముల్పూర్‌ జిల్లాలో వరద ప్రభావానికి ఒకరు మతి చెందారు. శుక్రవారం నల్బరీ జిల్లాలోని నిఖిలేష్‌ మల్లా బుజోర్‌బరువా అనే వ్యక్తి తన ఇంటి దగ్గర ఉన్న వరద నీటిలో ప్రమాదవశాత్తూ పడిపోయి మృతి చెందాడు. అయితే వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కింద పరి హారం అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇక ఈ వరద ప్రభావితమైన జిల్లాలుగా బజలి, చిరాంగ్‌, దర్రాంగ్‌, బక్సా, బర్పేట, బిస్వనాథ్‌, బొంగైగావ్‌, ధేమాజీ, ధుబ్రి, డీబ్రూగర్‌, గోల్‌పరా, గోలాఘాట్‌, కమ్రూప్‌, కోక్రాఝర్‌, లఖింపూర్‌, నాగోన్‌, నల్బరీ, తమూల్‌పూర్‌, ఉదల్‌గురిలు ఉన్నాయని ఎస్‌డీఎంఏ పేర్కొంది. బజలి జిల్లా పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఈ జిల్లాలో 267,253 మంది వరద నీటిలో ఇళ్లు మునిగిపోయి నిరాశ్రయులయ్యారు. 73,233 మంది నిరాశ్రయులై ఆ తర్వాత రెండో స్థానంలో బార్పేట జిల్లా నిలిచింది. 14 జిల్లాలో రాష్ట్ర యంత్రాంగం నిర్వహిస్తున్న 225 సహాయక శిబిరాల్లో కనీసం 35,142 మంది తలదాచు కున్నారు. బజలి జిల్లాల్లోనే అత్యధికంగా 73 సహా యక శిబిరాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో సుమారు 15,841 మంది ఆశ్రయం పొందినట్టు అధికారులు తెలిపారు. ఈ శిబిరాల్లోని ప్రజలకు ఆహారం, మందులు, ఇతర నిత్యావసరా లను నిర్వాహకులు అందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా, 10,782 హెక్టార్ల పంట భూములు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో పెద్ద మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతింటాయని, రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఈ వరదల నీటి ప్రవాహానికి మూడు జిల్లాలో కనీసం 14 కరకట్టలు దెబ్బతిన్నాయి. ఇక 14 జల్లాల్లోని 213 ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఆదివారం వరకు అస్సాంలోని వరద ప్రభావిత ప్రాంతాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బ్రహ్మపుత్ర, మానస్‌, పుతిమరి, పగ్లాదియ నదులన్నీ ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.