పస్తుల్లో.. మిషన్‌ భగీరథ కార్మికులు

– 4 నెలలుగా జీతాల్లేవు
– పీఎఫ్‌, ఈఎస్‌ఐ, బీమా పట్టవు
– అడుగడుగునా శ్రమ దోపిడే..
– నేడు ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం ముట్టడి
ప్రజల దాహార్తి తీర్చేందుకు మిషన్‌ భగీరథ కార్మికులు పస్తులుండీ పని చేస్తున్నారు. నాలుగు నెలలుగా ప్రభుత్వం జీతాలివ్వట్లేదు. రాత్రింబవళ్లూ పనిచేస్తున్నా పట్టుమని రూ.10వేల జీతమియ్యట్లేదు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ, బోనస్‌, ప్రమాద బీమా వంటి సదుపాయాలేవీలేవు. పండుగ రోజూ పనిచేయాల్సిందే.. లేదంటే జీతం కోత. ఏజెన్సీలు, ప్రభుత్వం కలిసి కార్మికుల్ని శ్రమ దోపిడీకి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని, కనీస వేతనం రూ.26 వేలివ్వాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు పోరుబాట పట్టారు.
నవతెంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఇంటింటికీ రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలు, రైతు వేదికలు, శ్మశానవాటికలకు కూడా మిషన్‌ భగీరథ నీళ్లను సరఫరా చేస్తున్నారు. నీటి శుద్ధి కేంద్రాల నుంచి పైప్‌లైన్ల ద్వారా ఓహెచ్‌ఆర్‌ఎస్‌ ట్యాంకులకు, అక్కడి నుంచి నల్లాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. నీటి శుద్ధి అయినప్పటి నుంచి నల్లాలకు సరఫరా అయ్యే వరకు కార్మికులదే కష్టం. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కార్మికులు వివిధ ఏజెన్సీల ద్వారా నియమించబడి పనిచేస్తున్నారు.
కనీస వేతనాలకు నోచని భగీరథ కార్మికులు
రాష్ట్ర వ్యాప్తంగా మిషన్‌ భగీరథ విభాగంలో నీటిశుద్ధి ప్లాంట్లు, ప్రయోగశాలలు, నాణ్యతా పరీక్షా కేంద్రాల్లో కెమిస్ట్‌లు, మైక్రో బయోలజిస్టులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, హెల్పర్లు, ల్యాబ్‌ అటెండర్లు, ల్యాబ్‌ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 710 మంది పనిచేస్తున్నారు. లైన్‌మెన్లు, పంపు ఆపరేటర్లు, పిట్టర్లు, వాల్‌ ఆపరేటర్లు, ఎలక్ట్రీషయన్లు, ప్లంబర్లు, వాచ్‌మెన్లుగా 10 వేలకు పైగా పనిచేస్తున్నారు. వీరంతా 2010 నుంచే ఆర్‌డబ్యూఎస్‌ కింద పనిచేస్తున్నారు. తెలంగాణ వచ్చాక మిషన్‌ భగీరథ పథకం కిందికి మార్చబడ్డారు. ఒక్కో క్యాటగిరి కార్మికుడికి ఒక్కో ఏజెన్సీ ఒక్కో పద్దతిలో జీతాలిస్తున్నాయి. నెలకు 30 రోజుల పాటు పనిచేస్తే రూ.7500 నుంచి రూ.10500 వరకు జీతాలిస్తున్నారు. కార్మికుల శ్రమ ఫలితంగా మిషన్‌ భగీరథ పథకానికి దేశ స్థాయిలో గుర్తింపు వచ్చింది. స్వయంగా సీఎం కేసీఆర్‌ పర్యవేక్షిస్తున్న ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు కావడంలేదు. నెలలో 30 రోజులూ కార్మికులు పనిచేయాలి. పండగ రోజు కూడా పనిలోకి రాకపోతే జీతంలో కోత పెడుతున్నారు. రాత్రింబవళ్లూ నీటి సరఫరా కోసం కష్టపడి పనిచేస్తున్న క్రమంలో కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని కార్మికులు కోరుతున్నా ఏజెన్సీలు పట్టించుకోవడంలేదు. బోనస్‌, పండగ సెలవులు వర్తించడంలేదు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయం కొన్ని ఏజెన్సీలు కల్పిస్తుండగా కొన్ని పట్టించుకోవడంలేదు.
4 నెలలుగా జీతాల్లేక పస్తుల్లో పనులు
మిషన్‌ భగీరథ స్కీంలో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు, కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు రావడంలేదు. వర్కింగ్‌ ఏజెన్సీలకు ప్రభుత్వం వేతనాల బిల్లులు నెలనెలా విడుదల చేస్తున్నప్పటికీ వాటిని ఉద్యోగులకు చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మిషన్‌ భగీరథలో కేఎల్‌ఎస్‌, ఎవరెస్ట్‌, మెఘా, జీకేఆర్‌, రాఘవ, ప్రివియర్‌, ఎల్‌ అండ్‌ టీ, కేబీఆర్‌, వీఎస్‌ఐ వంటి ఏజెన్సీ సంస్థలున్నాయి.
అవి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. మార్చి నుంచి కార్మికులు, ఉద్యోగులకు జీతాలివ్వలేదు. దాంతో కార్మికులు, ఉద్యోగులు పస్తులుండి పనిచేయాల్సి వస్తుంది.
చాలని జీతాలతో పస్తులుంటున్నం: రాములు, తెలంగాణ మిషన్‌ భగీరథ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి, సంగారెడ్డి
చాలి చాలని జీతాలతో పస్తుండి పనిచేస్తున్నం. 2010 నుంచి పనిచేస్తున్న. ఇప్పటికీ రూ.10 వేలకు మించి జీతం రావట్లేదు. మార్చి నుంచి జీతం లేక కుటుంబం గడవడమే కష్టమైంది. ధరలు పెరుగుతున్నాయి. కానీ.. మా జీతాలు పెరగట్లేదు. ప్రమాదాలకు గురవుతున్నా బీమా సదుపాయంలేదు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ లేదు. పండగ రోజు పనిచేయకపోతే ఆ రోజు జీతం కోతపెడుతుండ్రు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని అనేక పోరాటాలు చేసినం. ఏజెన్సీలు, ప్రభుత్వం మధ్య కార్మికులు చనిపోతుండ్రు.
ఎస్‌ఈ కార్యాలయాల్ని ముట్టడిస్తాం: జి.సాయిలు, తెలంగాణ మిషన్‌ భగీరథ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు
రాష్ట్రంలో మిషన్‌ భగీరథ స్కీంలో ఏజెన్నీల జోక్యం లేకుండా ప్రభుత్వమే నిర్వహించాలి. కార్మికులు, ఉద్యోగులకు ప్రభుత్వమే జీతాలివ్వాలి. కనీస వేతన జీవో ప్రకారం రూ.26 వేలు చెల్లించాలి. ఇతర చట్టబద్దమైన సదుపాయాలు కల్పించాలి. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే కార్మికులు అనేక కష్టాలు పడుతున్నారు. రాత్రిపూట పనిచేస్తున్న వారికి కనీసం టార్చ్‌ కూడా ఇవ్వట్లేదు. గుర్తింపు కార్డుల్లేవు. ఏన్నో ఏండ్లుగా పనిచేస్తున్నా ఇంకా రూ.10వేలకు మించి జీతాలివ్వడంలేదు. నెల నెలా వేతన బిల్లులు వస్తున్నా ఏజెన్సీలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నాయి.
”నా లాంటి పరిస్థితి మరో కుటుంబానికి రాకూడదు’
”నా లాంటి పరిస్థితి మరో కుటుంబానికి రాకూడదు’ ఇదీ..! మిషన్‌ భగీరథ కాంట్రాక్టు ఉద్యోగి పుష్పలత రాసిన సుసైడ్‌ నోట్‌ సారం. నల్గొండ జిల్లా పానగల్‌ నీటి శుద్ధి కేంద్రంలో పుష్పలత భర్త మహేష్‌ కాంట్రాక్టు కార్మికుడిగా పని చేశాడు. సరిపడా జీతం రాక, ఇచ్చే కొద్దిపాటి జీతమైనా నెలనెలా చేతికందక అప్పుల పాలయ్యాడు. కుటుంబం గడవడమే కష్టంగా మారడంతో అతను 2020 మార్చిలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో మహేష్‌ పనిచేసిన ప్లాంట్‌లోనే పుష్పలతకు ఉద్యోగం ఇచ్చారు. ఆమెకు కూడా జీతం చాలకపోవడం, రెగ్యులర్‌గా రాకపోవడం, అనారోగ్యం పాలవ్వడంతో అప్పులు పెరిగి ఆత్మహత్య చేసుకుంది. ఇలా నాలుగేండ్లలో 8 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికులందరిదీ ఇదే దయనీయమైన పరిస్థితి.

Spread the love