కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యం ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌

– సంక్షేమ పథకాలు తూచ తప్పకుండా అమలు
– అపోహలు విడిచి అభివృద్ధికి సహకరించాలి
– అధిష్టానం ఎలాంటి ఆదేశాలు
– ఇచ్చినా వాటిని తప్పక పాటిస్తా
నవతెలంగాణ-ఆమనగల్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్‌ యాదవ్‌ అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తూచ తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తు నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్టు చెప్పారు. బలమైన నాయకత్వ లక్షణం, దీక్షా దక్షతతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేసే నోటి దురుసు మాటలు, మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీలకు హైకమాండ్‌ ఢిల్లీలో ఉంటుంది మాకు హైకమాండ్‌ రాష్ట్ర ప్రజలే అని ఆయన చమత్కరించారు. ఆర్థికంగా దెబ్బతీయాలని భారతీయ జనతా పార్టీ ఎన్ని కుట్రలు చేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాణక్య రాజకీయంతో వాటినన్నిటినీ అధిగమిస్తు దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కుట్ర పూరితంగా అనుమతులు ఇయ్యకపోవడంతోనే రైతాంగంపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ప్రేమ బయట పడిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని 3 గంటల విద్యుత్‌ సరఫరా ప్రకటనలతో మళ్ళీ పూర్వపు రోజులు గుర్తుకు వస్తున్నాయని రైతులు అసహ్యించుకుంటున్నారని, రైతులను ఆవమానించిన వారు ఎవరూ బాగుపడలేదని రాబోయే ఎన్నికలపై పగటి కలలు కంటున్న కాంగ్రెస్‌ కలలు కల్లలు గాక తప్పదని ఆయన పేర్కొన్నారు. నరేంద్ర మోడీ నల్లచట్టాలను నలిపి వేసిన ఘనత రైతులకే దక్కుతుందనే విషయాన్ని మర్చిపోవద్దని ఎమ్మెల్యే గుర్తు చేశారు. నిరంతరం తన రాజకీయ జైత్రయాత్ర కొనసాతుందని, ప్రజలకు సేవ చేయడం పవిత్ర యజ్ఞం లాంటిదని కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజల మధ్యనే ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా వాటిని తప్పక పాటిస్తానని అన్నారు. తల్లి లాంటి పార్టీని కాపాడుకునేందుకు తన శక్తినంతా ధారపోస్తానని, అపోహలు విడనాడి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించి ప్రజల్లో గౌరవాన్ని పెంపొందిం చుకోవాలని ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు.