మోడీ మరో మోసం

– నేడు వరంగల్‌కు ప్రధాని రాక
– రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ బదులు వ్యాగన్‌ రిపేరుకు శంకుస్థాపన
– అడ్డుకుంటారనే భయంతో నేతల గృహనిర్బంధం
– విభజన హామీలపై స్పష్టతకు విపక్షాల డిమాండ్‌
– శనివారం ప్రయివేట్‌ పాఠశాలల బంద్‌
పిల్లి పోయి ఎలక వచ్చే ఢాం..ఢాం…ఢాం…అన్నట్టే తయారైంది ప్రధాని మోడీ వరంగల్‌ పర్యటన. విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కేటాయించిన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలిం చుకెళ్లి, కాజీపేటలో నామ్‌కే వాస్తేగా రైల్వే వ్యాగన్‌ రిపేరు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసేందుకు మందీ మార్బలంతో హడావిడిగా వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి ఏదో ఒకటి చేశాం అంటూ ‘మమ’ అని నెత్తిన నీళ్లు చల్లుకొని పునీతులై ప్రచారం చేసుకోవడానికి ఈ ‘రిపేరు’ పరిశ్రమ అక్కరకు వస్తుందనేది కమలనాధుని ఆశ. నిజాం సర్కారుపై తిరుగుబావుటా ఎగురేసి తరిమికొట్టిన చైతన్యవంతమైన తెలంగాణలో మోడీ మోసాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకంగా ఇక్కడి ప్రజలు లేరనే వాస్తవాన్ని ఆయన ఇంకా గమనించినట్టు లేదు!
ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తల అరెస్టులు ప్రజాగ్రహం తప్పదు
అరెస్టులపై తమ్మినేని ఖండన
వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ప్రతిపక్ష పార్టీల నేతలను, కార్యకర్తలను పోలీసులు ముంద స్తుగా అరెస్టు చేయడం, గృహ నిర్బంధా లకు పాల్పడటాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. కేంద్రం ఇంతవరకు రాష్ట్ర విభజన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో హామీలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు?
మోడీకి పొన్నాల ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చ కుండా ఏ మొహం పెట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారంటూ టీపీసీసీమాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్యయ్య ప్రధాని మోడీని ప్రశ్నించారు. రోడ్డు విస్తరణ కోసం వస్తున్నారా? పార్టీ కార్యక్రమాల కోసం వస్తున్నారా? అని నిలదీశారు.
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వరంగల్‌ పర్యటనకు వస్తున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఇదిలా వుంటే, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు పలువురిని శుక్రవారమే పోలీసులు అదుపులోకి తీసుకోవడం, హౌస్‌ అరెస్టు చేయడం గమనార్హం. శనివారం ఉదయం 10.00 గంటలకు వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా భద్రకాళి దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రధాని హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ ప్రాంగణానికి చేరుకొని, రూ.6,109 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం సభనుద్దేశించి ప్రసంగించనున్నారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉదయం 4.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు వరంగల్‌, హన్మకొండ నగరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సెక్షన్‌ 30 యాక్టు విధించి, ఎవరూ సమా వేశాలు, సభల నిర్వహణ, నిరసనలు తెలపొద్దని ప్రకటించారు. డ్రోన్లను వినియోగించొద్దని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి శుక్రవారం ఉదయం హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానాన్ని సందర్శించి ప్రధాని సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏర్పాట్ల విషయమై వరంగల్‌ పోలీసు కమిషనర్‌ ఎ.వి.రంగనాథ్‌, హన్మకొండ, జిల్లా కలెక్టర్లు సిక్తా పట్నాయక్‌, పి.ప్రావీణ్య మంత్రికి వివరించారు.
ప్రయివేట్‌ పాఠశాలల బంద్‌
ప్రధాని నరేంద్రమోడీ వరంగల్‌ పర్యటన వల్ల శనివారం నగరంలోని ప్రయి వేట్‌ పాఠశాలలకు బంద్‌ ప్రకటించారు. బహిరంగ సభకు వచ్చే వాహనాలకు ప్రయివేట్‌ పాఠశాలల్లో పార్కింగ్‌కు అనుమతించినందున బంద్‌ ప్రకటించారు. వాహనాలకు సిటీ సరిహద్దుల్లోని విశాల ప్రాంగణాలు కలిగిన పాఠశాలల్లో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు.
పోలీసుల అదుపులో ప్రతిపక్ష నేతలు
ప్రధాని మోడి పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ నేతలను పోలీసులు ముందస్తుగా శుక్రవారమే అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును హన్మకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ(ఎం) వరంగల్‌ జిల్లా కార్యదర్శి సిహెచ్‌.రంగయ్య, కార్యదర్శి వర్గ సభ్యులు నలిగంటి రత్నమాల, నాయకులు ముక్కెర రామస్వామి, కాంగ్రెస్‌ నాయకులు కరాటే ప్రభాకర్‌, బీఎస్పీ వరంగల్‌ జిల్లా అధ్యక్షులు మంద శ్యామ్‌ను మట్టెవాడ పోలీసులు అదుపులోకి తీసుకొని మడికొండ పిటిసికి తరలించారు. జనగామ డీసీసీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డిని హౌస్‌ అరెస్టు చేశారు. పలువురు కాంగ్రెస్‌ నేతలను అదుపులోకి తీసుకొని మడికొండలోని పోలీసు ట్రైనింగ్‌ కాలేజీకి తరలించారు. మడికొండ పిటిసిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు మోడీ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తూ అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. హన్మకొండ జిల్లా సీపీఐ(ఎం) నాయకులు కాడబోయిన లింగయ్యను ఐనవోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎఐటియుసి వరంగల్‌ జిల్లా అధ్యక్షులు కందిక చెన్నకేశవులును నెక్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బికెఎంయు నాయకులు జాతీయ నాయకులు టి.వెంకట్రాములును హన్మకొండ పోలీసులు తీసుకున్నారు. అరెస్టులపై విపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి
– జిల్లాలో నిరసన కార్యక్రమాలకు పిలుపు
నవతెలంగాణ-గోవిందరావుపేట
రాష్ట్ర విభజన హామీలను అమలు చేయని ప్రధానమంత్రి మోడీ వరంగల్‌ పర్యటనను ప్రజలు వ్యతిరేకించాలని సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మ ల వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శక్రవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పసర పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం కడారి నాగ రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తెలం గాణ ఏర్పడి 9 ఏండ్లు పూర్తయినా.. రాష్ట్ర విభజన హామీల్లో కేంద్రం ఒక్కటీ అమ లు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఈనెల 8న వరంగల్‌కు వస్తున్నారని.. విభజన హామీలపై ప్రకటన విడుదల చేయాలని డిమాండ్‌ చేశా రు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం 576 ఎకరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే.. భూమి ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పడం దుర్మార్గమన్నారు. వెంటనే గిరిజన యూనివర్సిటీపై మోడీ ప్రకటన చేయాలని, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీల ఏర్పాటు సంగతేంటో తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. విభజన హామీలు అమలు చేయని మోడీ రాకను వ్యతిరేకిస్తూ శనివారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.నాయకులు పొదిల్లా చిట్టిబాబు, గొంది రాజేష్‌, అంబాల పోశాలు, క్యాతం సూర్యనారాయణ, సోమ మల్లారెడ్డి, బొచ్చు సంజీవ, గణేష్‌, రాజేశ్వరి, కవిత, రజిత, అశోక్‌ రాంబాబు, అచ్చమ్మ పాల్గొన్నారు.

 

Spread the love