అవకాశం ఇవ్వని మోడీ

– మణిపూర్‌ ప్రతినిధి బృందాన్ని కలవకుండానే అమెరికా పర్యటనకు
– ఈ నెల 10 నుంచి ఢిల్లీలోనే ఉన్న బృందం.. అయినా ఫలించని ఎదురుచూపులు
– రాష్ట్రంలో సంక్షోభానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి
– పీఎంఓలో మెమోరాండం సమర్పించిన బృందం
న్యూఢిల్లీ : కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ తీవ్ర అల్లర్లకు కేంద్ర బిందువైంది. నెలకు పైగానే కొనసాగుతున్న అల్లర్లు తీవ్ర రూపం దాల్చి హింసాత్మకంగా మారాయి. రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటాయి. దీంతో శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలను రంగంలోకి దింపాల్సిన పరిస్థితులూ ఏర్పడ్డాయి. అయితే, ఈ విషయంలో ప్రధాని మోడీ నోటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క మాట కూడా వెలువడలేదు. దీంతో ప్రధాని తీరుపై ఇప్పటికే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో ప్రధానిని కలవాలని మణిపూర్‌ నుంచి పది పార్టీలకు చెందిన ప్రతినిధి బృందం ప్రయత్నించింది. ఆయనను కలవటం కోసం ఈ బృందం ఈ నెల 10 నుంచి దేశ రాజధానిలోనే ఉన్నది. కానీ, మోడీ మాత్రం మణిపూర్‌ ప్రతినిధి బృందానికి కలవ డానికి అవకాశం ఇవ్వకుండానే అమెరికా పర్యటనకు బయలుదేరటం గమనార్హం. దీంతో మోడీ తీరుపై ఈ ప్రతినిధి బృందం అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ప్రధానికి ఐదు నిమిషాల సమయం కూడా లేదా? : మాజీ సీఎం ఇబోబి సింగ్‌
మణిపూర్‌ అల్లర్లలకు ఆ రాష్ట్రంలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 60 వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలో ఇప్పటికీ శాంతియుత పరిస్థితులు పునరుద్ధరణ కాలేదు. ఇలాంటి తరుణంలో ఇక్కడి పరిస్థితిపై కలవడానికి మోడీ నిరాకరించటం పట్ల మణిపూర్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నాయకులు ఇబోబి సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తమ పట్ల ఇలా ఉదాసీనంగా వ్యవహరించటం సరికాదన్నారు. తాము కోరుకున్నది సాధారణ స్థితిని పునరుద్ధరించటం మాత్రమే అని చెప్పారు. ”మాకు విలువ లేదని మేము భావిస్తున్నాం. మేము దేనిని అడుక్కోవడానికి రాలేదు. మేము యాచకులం కాదు. మా ప్రజలు చనిపోతున్నారు. మా రాష్ట్రం కాలిపోతున్నది. మేము శాంతిని కోరుకుంటున్నాం. కానీ ప్రధానికి మా కోసం ఐదు నిమిషాల సమయం లేదు” అని ఆయన అన్నారు.
‘మణిపూర్‌ సమస్యను జాతీయ సమస్యగా పరిగణించాలి’
‘ఆదిపురుష్‌’ చిత్ర డైలాగ్‌ రైటర్‌ను కలవడానికి 45 నిమిషాల సమయం కేటాయించిన ప్రధాని, మణిపూర్‌ సమస్యపై చర్చకు నిమిషాలు కేటాయించలేకపోవడం బీజేపీ వైఖరిని ప్రతిబింబించిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అజోరు కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాజకీయాలు, సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత ఫలితంగా రాష్ట్రంలో ఈ విపత్తు ఏర్పడిందనీ, దీనిని జాతీయ సమస్యగా పరిగణించాలని ఇబోబి సింగ్‌ తెలిపారు. ప్రధాని నిబద్ధత, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి ఉంటే, హింస 24 గంటల్లో ఆగిపోయేదని అన్నారు.
‘పాలనా వైఫల్యం కారణంగానే ఈ సమస్య’
తాము చాలా నిరాశకు గురైనట్టు మరో సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి నిమారు చంద్‌ లువాంగ్‌ అన్నారు. ”మణిపూర్‌లో ప్రజలు సంతోషంగా లేరు. ప్రజలు ఇప్పుడు ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ ముఖాన్ని చూడాలని కోరుకోవటం లేదు. ఆయన వెళ్లాలి” అని లువాంగ్‌ తెలిపారు. ప్రతినిధి బృందంలోని ఇతర సభ్యులందరూ సంక్షోభానికి బీరెన్‌ సింగ్‌ కారణమని ఆరోపించారు.
హింసను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
మోడీ అమెరికా పర్యటనకు వెళ్లిన తర్వాత ప్రతినిధి బృందం ప్రధాన మంత్రి కార్యాలయానికి వెళ్లి అధికారులకు మెమోరాండం సమర్పించింది. మే3న రాష్ట్రంలో మొదలైన ఇబ్బందుల వివరాలను ఇందులో పొందుపర్చింది. కేంద్రం, రాష్ట్రంలోని రెండు ప్రభుత్వాలు కొనసాగుతున్న హింసను అరికట్టటంలో విఫలమైనందున బాధ్యత వహించాలి అని పేర్కొన్నది. ప్రత్యేక అడ్మినిస్ట్రేషన్‌ యూనిట్‌ కోసం పది మంది కుకీ ఎమ్మెల్యేల డిమాండ్‌ను ప్రస్తావిస్తూ.. తాము దానిని వ్యతిరేకిస్తున్నామని వివరించింది.

Spread the love