డిజిటల్‌ ప్రకటనల్లోనే అధిక ఉల్లంఘనలు

– గేమింగ్‌లో భారీగా పెరుగుదల :ఆస్కీ రిపోర్ట్‌
న్యూఢిల్లీ : డిజిటల్‌ ప్రకటనల రంగంలోనే అత్యధిక ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ) ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. 2022-23కు సంబంధించిన వార్షిక ఫిర్యాదుల నివేదికను ఆస్కి విడుదల చేసింది. ఈ ఏడాది కాలంలో ప్రింట్‌, డిజిటల్‌, టెలివిజన్‌తో సహా వివిధ మాధ్యమాలలో 7,928 ప్రకటనలను ఆస్కీ సమీక్షించింది. డిజిటల్‌ ప్రకటనలు కేవలం ఉల్లంఘనల్లో టాప్‌లో ఉండటంతో పాటుగా నిబంధనలను అతి తక్కువగా పాటిస్తున్నాయి. 92 శాతం గేమింగ్‌ ప్రకటనలు ఉల్లంఘనలకు పాల్పడ్డాయని ఆస్కీ తెలిపింది. ”మార్గదర్శకాలను ఉల్లంఘించే ప్రకటనల విషయంలో డిజిటల్‌ మాధ్యమం ముందుంది. ఇది ఆన్‌లైన్‌ వినియోగదారు భద్రత, విశ్వాసం గురించి ముఖ్యమైన ఆందోళనలను లేవనెత్తుతుంది. వినియోగదారుల ప్రయోజ నాలను కాపాడేందుకు ఈ సమస్యను అత్యవసర ప్రాతిపదికన పరిష్కరించ డానికి ప్రకటనకర్తలు, కంటెంట్‌ సృష్టికర్తలు, ప్లాట్‌ఫామ్‌లు కలిసి రావాలి. మార్గదర్శకాలను ఉల్లంఘించే గేమింగ్‌ ప్రకటనల సంఖ్య గణనీయంగా పెరగడాన్ని కూడా పరిశ్రమ తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది.” అని ఆస్కీ సీఈఓ, సెక్రెటరీ జనరల్‌ మనీషా కపూర్‌ పేర్కొన్నారు.

Spread the love