మధ్యప్రదేశ్ లో మోస్ట్ వాంటెడ్ కోతి అరెస్టు

నవతెలగాణ – మధ్యప్రదేశ్
మనుషులపై దాడులు చేస్తూ రెండు వారాలుగా ముప్పు తిప్పలు పెట్టిన కోతిని అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. డ్రోన్ సాయంతో గాలించి, మత్తు ఇంజెక్షన్ చేసి బోనులో పెట్టారు. ఇప్పటి వరకు ఈ కోతి 20 మందిపై దాడి చేసిందని, బాధితుల్లో చిన్నారులతో పాటు వృద్ధులు కూడా ఉన్నారని చెప్పారు. మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ లో ఈ కోతి దాడులకు జనం భయాందోళనలకు గురయ్యారు. వరుస దాడుల నేపథ్యంలో ఈ కోతిని బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది అన్ని ప్రయత్నాలు చేశారు. పట్టిచ్చిన వారికి రూ.21 వేలు బహుమానంగా అందిస్తామని రాజ్ గఢ్ స్థానిక అధికారులు ప్రకటించారు. రాజ్ గఢ్ లో ఇళ్లపైన తిరుగుతూ 15 రోజులుగా ఈ కోతి ముప్పుతిప్పలు పెట్టింది. ఎనిమిది మంది చిన్నారులతో సహా మొత్తం 20 మంది ఈ కోతి దాడిలో గాయపడ్డారు. ఈ కోతిని బంధించేందుకు స్థానిక అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో కలెక్టర్ చొరవతో ఉజ్జయిని అటవీ శాఖ రెస్క్యూ టీమ్ బుధవారం రాజ్‌గఢ్‌కు చేరుకుని డ్రోన్‌ సాయంతో కోతిని చాకచక్యంగా బంధించారు. మత్తు వదిలిన తర్వాత కోతి కోపంతో రగిలిపోయింది. బోనులోంచి బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఈ కోతిని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేస్తామని అటవీశాఖ సిబ్బంది తెలిపారు.