మణికొండలో దారుణం.. తల్లీకూతుళ్ల ఆత్మహత్య

నవతెలంగాణ -హైదరాబాద్‌: మణికొండలో దారుణం జరిగింది. కరోనా తర్వాత తీవ్ర మానసిక వేదనకు గురైన తల్లీకూతుళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు.ఉరేసుకునే ముందు తండ్రిని ఇంటి నుంచి దూరం పంపించడమే కాకుండా.. ఇంట్లో ఉన్న పాతబట్టలు అన్నింటినీ తగులబెట్టారు. దీంతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య ఇప్పుడు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మణికొండ ఆంధ్రా కాలనీలో సదానందం -అలివేలు దంపతులు కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. వారికి కుమార్తె లాస్య ( 14), ఒక కుమారుడు (8) ఉన్నారు. అన్యోన్యంగా సాగిపోతున్న వీరి సంసారంలో కరోనా వైరస్‌ చిచ్చు పెట్టింది. లాక్‌డౌన్‌ సమయంలో తల్లీకూతుళ్లు అలివేలు, లాస్య మానసికంగా తీవ్ర వేదనకు గురయ్యారు. అప్పట్నుంచి ఇంట్లో నుంచి బయటకు రావడం మానేశారు. రెండేండ్లుగా ఇంటి పట్టునే ఉంటున్నారు. సదానందం కూడా ఏ జాబ్‌ చేయకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్‌ చేసుకున్నారు. ఇందుకు భర్త అడ్డుగా ఉండకూడదనే ఉద్దేశంతో సదానందాన్ని దూరంగా పంపించాలని నిర్ణయించుకున్నారు. అతనికి గురువారం సాయంత్రం రూ.5వేలు ఇచ్చి బలవంతంగా యాదాద్రికి పంపించారు. శుక్రవారం తెల్లవారుజామున తల్లీకూతుళ్లు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎనిమిదేళ్ల కుమారుడిని కూడా చంపేయాలని అలివేలు ప్రయత్నించింది. కానీ కుదరలేదు. కాగా, ఆత్మహత్యకు ముందు తల్లీకూతుళ్లు కలిసి ఇంట్లో ఉన్న పాత బట్టలు అన్నింటినీ తగులబెట్టారు. పైగా కూతురి చేతి మీద do something that makes you happy అని గోరింటాకుతో రాసి ఉంది. ఇక ఇద్దరి చేతుల మీద the game is started అనే పదాలు ఉండటం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. వీళ్ల ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుందోనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.