నరహరి నారాయణరెడ్డి కవిత ‘గంజి’

‘గంజి’

ఉన్నోడికీ
గంజే కావాలి!

లేనోడికీ
గంజే కావాలి!

ఉన్నోడికీ
ఖద్దరుచొక్కా
నిక్కపొడుచుకోవడానికి!

లేనోడికీ
కడుపునింపుకోవడానికి!
(నరహరి నారాయణరెడ్డి)
కవిత చివరలో చురకలు వేస్తూ ముగించటం కొంతమంది కవుల కవిత్వంలో గమనిస్తాం. వ్యంగ్య రూపంలోని ‘టోన్‌’ ఎత్తుకొని నడిపించటం మరికొన్ని కవితల్లో గమనిస్తాం. కొసమెరుపుతో కవితను ముగించటం ఇంకొన్ని కవితల్లో గమనిస్తాం. కవి చురకలను, వ్యంగ్యాన్ని, కొసమెరుపును ప్రదర్శించటమనేది ఎక్కువగా మినీ కవితలలో చోటు చేసుకుంటుంది. మినీ కవితలు అనగానే నాకు ప్రత్యేకంగా రావి రంగారావు గుర్తొస్తారు. అలిశెట్టి ప్రభాకర్‌ గుర్తొస్తారు. సూక్ష్మంలో మోక్షం చూపించటం ఈ కవితల ప్రత్యేకత. ఆ కోవకు చెందిన కవితనే సాక్షి ఫన్‌ డే బుక్‌ లో ప్రచురించబడ్డ గంజి కవిత. ఈ కవితను నరహరి నారాయణరెడ్డి రచించారు.
‘గంజి’ అనే పేరు పేదవాడి బతుకు చిత్రానికి ప్రతీక. ‘కాసిన్ని గంజి నీళ్లు పోసే గతి కూడా లేదు’ అనే సామెత వినే ఉంటారు. బతుకులో చివరి ఆధార బిందువులు ఈ గంజి నీళ్లు. ఇప్పటికీ ఈ గంజినీళ్ళతోనే ఒక పూట వెళ్ల దీసుకునే కుటుంబాలు ఎన్నో వున్నాయి. ఇంకో కోణం నుంచి చూస్తే గంజినీళ్లు ఆరోగ్యకరం. ఎంతో శ్రేష్టమైనవి కూడా. కవి గంజిని గూర్చి రాసిన ఈ కవిత ఏదో కావాలని అల్లిన కవిత కాదు. మెరుపులా కవిలో కలిగిన ఆలోచన. కవికున్న సామాజిక దృక్పథం ఈ పాదాలను రాయించి ఉండొచ్చు. ఈ కవితా పాదాలు చిన్నవిగా ఉన్నా ఇదో మినీ ఆటంబాంబు. తగలాల్సిన చోట తగులుతున్నది.
సాధారణంగా ఎత్తుగడలో కవితలోకి వెళ్లడానికి కొంత వాతావరణాన్ని ఓ కవి సృష్టిస్తాడు. ఇంకొ కవి నేరుగా సూటిగా శీర్షిక ప్రస్తావననే ఎత్తుగడలో తీసుకొస్తాడు. మరోకవి ఎత్తుగడను మార్మికంగా చెప్పి ఒక్కొక్క పొరను విప్పుకుంటూ వస్తాడు. ఈ కవి చాలా సాధారణమైన పదాలతో శీర్షిక లోంచి ఎత్తుగడను తీసుకొచ్చాడు.
వెనకడుగు వేయకుండా చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెబుతూ ”ఉన్నోడికి గంజే కావాలి” అని ఆలోచనాత్మకంగా కవితను ప్రారంభించాడు. ఎత్తుగడ ప్రారంభం నుండే కవి ఉత్సుకతను కలిగించాడు. ఇంకో పార్శ్వంలో ఉన్నోళ్ళు రకరకాల పండ్లు, రకరకాల వంటకాలు తింటుంటారు కదా గంజి కావాలనడమేమిటి అనే సందిగ్ధ ప్రశ్న కాసేపు మనల్ని వెంటాడుతుంది. అంతలోనే దానికి సమర్థింపుగా కవి మరో రెండు వాక్యాలు రాసి కవిత నిర్మాణ క్రమాన్ని బ్యాలెన్స్‌ చేసి ఇంకొంత స్పష్టతనిచ్చాడు.
కవితా పాదాలు తన అభిమతాన్ని చెప్పటానికి మాత్రమే రాయకుండా పేద ప్రజల పక్షాన పరోక్షంగా నిలబడి గొంతు విప్పి మాట్లాడినట్లుంది. పేద ప్రజల దీనస్థితిని తెలియపరచడానికి కవి రెండవ యూనిట్‌లో ”లేనోడికి గంజే కావాలి” అంటూ స్పష్టంగా బల్లగుద్దినట్లు విషయాన్ని కళ్ళ ముందు పరిచాడు. మూడో యూనిట్‌లో సమన్వయాన్ని సాధిస్తూ పేదవాడికి, ఉన్నవాడికి ఉన్న తేడాను బహిర్గతం చేశాడు. రాసినవి తక్కువ పంక్తులే అయిన ‘వాసి’ అయినవి రాశాడు. మినీ కవితను రాసినప్పుడు విషయం కొన్నిసార్లు స్పష్టతను కోల్పోతుంది. సరియైన చురక ఒక్కోసారి కనిపించదు. ఈ కవితలో వాటినన్నింటిని క్రమ పద్ధతిలో నడిపిస్తూ కవి చక్కటి వస్తు నిర్వహణ చేశాడు. నాలుగవ యూనిట్లో పూర్తిగా కుండబద్దలు కొట్టి, ‘ఖద్దరు చొక్కా’ అనే పదాన్ని ఉపయోగించి ఉన్నత స్థాయిలోని వారిని, రాజకీయ నాయకులను దృష్టిలోకి తెచ్చాడు. గంజి పెట్టిన చొక్కాను గుర్తుచేయడమంటే ఆ ఇస్త్రీ మడతలలో నలుగుతున్న జీవితాలను గూర్చి మాట్లాడటమే. చొక్కాకు గంజి వేసుకోవడం తప్పేమీ కాకపోవచ్చు. బాధ్యతయుతమైన పదవిలో ఉన్నప్పుడు ఆ చొక్కా సక్రమంగా పనిచేస్తుందా లేదా అనేది ముఖ్యం. ఈ కవిత లోపలి అంతరార్థం కూడా అదే.
చివరి యూనిట్‌లో చురకలేస్తూ ముగించటం ఈ కవిత బలం. జీవితాన్ని మదించి పోత పోసిన పద్యమిది. మంచి కవిత అంటే ఎత్తుకున్న అంశం మూలాలను పట్టించేదిగా ఉండాలి. కవితనాడీ పట్టుకొని చూస్తే ఆరోగ్యకరమైన స్పందనలను కలిగివుండాలి. పై లక్షణాలు కలిగిన ఈ కవిత పూర్తిగా జనరంజకమైనది. తనకు తానుగా నిలిచి మన హృదయంలో ఈ కవి తాలూకూ చెరగని ముద్ర వేసింది.
– తండా హరీష్‌
8978439551

Spread the love