సీబీఐ విచారణ వద్దు…

– ఎమ్మెల్యేలకు ఎర దర్యాప్తుపై సుప్రీం స్టేటస్‌ కో
– విచారణ జూలై 31కి వాయిదా
న్యూఢిల్లీ : తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై నిర్ణయం తీసుకునే వరకు సీబీఐ విచారణ చేపట్టొద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు స్టేటస్‌ కో (యథాతథ స్థితి కొనసాగడం) ఆదేశాలు ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఎర వ్యవహారం కేసు విచారణను స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం (పోలీసులు) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూ ర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. తెలంగాణ పోలీసుల తరపు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపిస్తూ విచారణను సీబీఐకి అప్పగించడాన్ని వ్యతిరేకించారు. ‘నేను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అడిగాను. కేసును సీబీఐ స్వాధీనం చేసుకోలేదు’ అన్నారు. దర్యాప్తుకు సంబంధించిన పత్రాలను తాము సీబీఐకి అందచేయలేదని తెలిపారు. బీజేపీ తరపు సీనియర్‌ న్యాయవాది మహేష్‌ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. ‘కేసు కోర్టులో ఉండగా సీబీఐ విచారణ కొనసాగించకూడదు. అది నిరుపయోగంగా మారుతుంది. ఇది సాధారణ నియమం. విచారణ కొనసాగించొద్దు. లేదంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. మేము యథాతథ స్థితికి ఆదేశిస్తాం’ అని ధర్మాసనం పేర్కొంది. కేసు తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది.

Spread the love