ఏడాదిలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ

– జాతీయస్థాయిలో 4 శాతం, తెలంగాణలో 7.5 శాతం నిరుద్యోగం :కేంద్ర సహాయ మంత్రి భగవంత్‌ ఖూబా
– హైదరాబాద్‌ రోజ్‌గార్‌ మేళాలో 135 మందికి ఉద్యోగ నియామక పత్రాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అవినీతికి తావులేకుండా ఏడాదిలో పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తున్నదని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్‌ ఖూబా అన్నారు. అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న విధానాల వల్ల జాతీయ స్థాయిలో నిరుద్యోగం గణనీయంగా నాలుగు శాతానికి తగ్గిందని చెప్పారు. అయితే తెలంగాణలో మాత్రం 7.5 శాతం నిరుద్యోగం ఉందన్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో శనివారం నిర్వహించిన రోజ్‌గార్‌ మేళాలో 135 మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను మంత్రి అందజేశారు. ఎయిమ్స్‌, పవర్‌ గ్రిడ్‌, ఎల్‌ఐసీ, కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాంటి ప్రభుత్వ సంస్థల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత ఉద్యోగాలు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లోనే నిరుద్యోగం తక్కువగా ఉందని చెప్పారు. ఇక్కడ నిరుద్యోగం 3.3 శాతమేనని వివరించారు. తొమ్మిదేండ్లలో చేపట్టిన పారదర్శక విధానాల ద్వారా జీడీపీ 7.5 శాతానికి పెరిగిందన్నారు. ద్రవ్యోల్బణం 4.2 శాతానికి తగ్గిందని అన్నారు. తొమ్మిదేండ్లలో పేదల జీవితాలు మెరుగుపడ్డాయని చెప్పారు. 15 కోట్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖపైకి వచ్చారని వివరించారు. ముద్రా యోజన ద్వారా 40 కోట్ల మందికి రుణాలు వచ్చాయనీ, అందులో మహిళలే ఎక్కువగా ఉన్నారని అన్నారు. నాలుగు కోట్ల మంది పేదలకు ఇండ్లు, 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించామని చెప్పారు. పేదల జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.1.90 కోట్లు జమ అయ్యాయని వివరించారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పేదలకు ఇస్తున్న ప్రతి రూపాయీ వారికే అందుతోందని అన్నారు. ఏ దేశంలో లేని విధంగా భారత్‌లో 92 కోట్ల మంది 18 నుంచి 59 ఏండ్ల మధ్య ప్రజలున్నారని చెప్పారు. మానవ వనరులను గరిష్టంగా ఉపయోగించుకుంటూ 2047 నాటికి భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ కమిషనర్‌ సందీప్‌ ప్రకాశ్‌, కమిషనర్‌ సంగీత తదితరులు పాల్గొన్నారు.