మోడీ మహానటనకు.. ఆస్కార్‌ వస్తుండే

– ఆయన మాటలు కోట్లల్లో.. చేతలు పకోడీల్లో..
– దోస్తుతో కలిసి దేశాన్ని దోస్తుండు..
– మోడీ, ఈడీలకు భయపడబోం..ప్రజాకోర్టులోనే తేల్చుకుంటాం : కేటీఆర్‌
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
”ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నాటు-నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు వచ్చింది. కానీ మనదేశంలో అద్భుతమైన మహానటుడు ఒకాయన ఉన్నాడు. ఆయన పేరును ప్రతిపాదిస్తే ఆ నటనకు తప్పకుండా అవార్డు వచ్చేది’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సెటైర్లు వేశారు. ”ఆయనెవరో మీకు యాది ఉన్నాడా” అని కేటీఆర్‌ ప్రశ్నించగానే సభకు హాజరైన జనం నుంచి మోడీ అంటూ గట్టిగా వినిపించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం జక్కాపూర్‌ గ్రామ శివారులో రూ.478 కోట్లతో నాగమడుగు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి మంత్రి కేటీఆర్‌ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జుక్కల్‌ నియోజకవర్గంలోని పిట్లంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘భాయి ఔర్‌ బహేనో.. జన్‌ ధన్‌ ఖాతా కోలో.. ధన్‌ ధన్‌ ఖాతమే పంద్రా (రూ.15లక్షలు) లాక్‌ అయ్యేగా’ అని ప్రధాని మోడీ అన్నాడని, ఇక్కడున్న మీలో ఎవరి ఖాతాలోనైనా రూ.15 లక్షలు పడ్డాయా అని ప్రశ్నించారు. లేదు లేదు అంటూ జనం చేతులు చూపారు. ఆ రూ.15 లక్షలతో పాటు దేశం మొత్తం సంపదను దోచి ఆయన దోస్తు అదానీ ఖాతాలు లక్షల కోట్లతో నింపుతుండని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి అదే దోస్తు నుంచి ఫండ్‌ తీసుకుని ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను కొంటూ దేశాన్ని ఆగం చేస్తుండని విమర్శించారు. ప్రతేడాది రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని, చివరకు పకోడిలు వేసుకోవడం కూడా ఉద్యోగమని కొత్త నిర్వచనం ఇచ్చాడని దుయ్యబట్టారు. ‘మోడీ మాటలు కోట్లల్లో.. చేతలు పకోడిల్లో’ అంటూ వ్యాఖ్యానించారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని, నల్లధనం వెనక్కు తెస్తామని హామీలు గుప్పించి అమలు చేయడం లేదని విమర్శించారు. మన్మోహన్‌సింగ్‌ హయాంలో వంట గ్యాస్‌ సిలెండర్‌ ధర రూ.400 ఉంటే సన్నాసి, దద్దమ్మ అని విమర్శించిన మోడీ… మరి తన హయాంలో రూ.1200 ధర అయ్యిందని, మరి నిన్ను ఏమనాలంటూ ప్రశ్నించారు. తెలంగాణపై మోడీ కక్ష కట్టిండని, విభజన హామీలు అమలు చేయట్లేదన్నారు. గాలి గత్తరకేసులతో ఆగమాగం చేస్తుండని, మోడీ, ఈడీలకు భయపడబోమని, ఏం చేసుకుంటారో చేసుకోండని సవాల్‌ విసిరారు. ఏదైనా ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామన్నారు. ఎవరు నీతిమంతులో, ఎవరు అవినీతిపరులో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. 2023 ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్‌ కూడా రానియ్యకుండా ప్రజలే తీర్పు చెబుతారని అన్నారు. మళ్లీ ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ వాళ్లు గొంతుచిం చుకుంటున్నారని, 55 యేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. కరెంటు, నీళ్లు, విద్య ఇచ్చే తెలివిలేనోళ్లు మళ్లీ ఏం చేస్తారని విమర్శించారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ను గెలిపించి రాష్ట్రంలో కేసీఆర్‌ను హ్యాట్రిక్‌ సీఎం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, జాజుల సరేందర్‌, బిగాల గణేష్‌గుప్తా, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ దఫేదర్‌ శోభరాజు, కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు ముజీబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love