సెమిస్టర్‌ పరీక్షలపై ఓయూ విద్యార్థుల ఆందోళన

– సిలబస్‌ కాకుండా పరీక్షలెలా పెడతారని ఆగ్రహం
– ఇంటర్నల్స్‌ బహిష్కరణ
– వర్షంలోనే రోడ్డుపై బైటాయింపు
– పరిపాలన భవన్‌ వైపు దూసుకెళ్లిన వారి అరెస్ట్‌
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2వ, 4వ, సెమిస్టర్స్‌ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు కొన్ని రోజుల నుంచి ఉద్యమిస్తున్నారు. అయితే అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు ఆందోళనను ఉధృతం చేశారు. బుధవారం ఓయూ సెంటినరీ హాస్టల్‌ విద్యార్థినులు ఇంటర్నల్స్‌ రాయబోం అంటూ ప్రధాన గేట్‌కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటల సమయంలో ర్యాలీగా వెళ్లి ఓయూ లేడీస్‌ హాస్టల్‌ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. మరికొందరు విద్యార్థులు వర్సిటీ ప్రధాన రోడ్డుపై బైటాయించారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా తడుస్తూనే నిరసన కొనసాగించారు. ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొ. లక్ష్మీనారాయణ అక్కడకు వచ్చి నచ్చజెప్పినా.. తమకు న్యాయం చేయాలంటూ పట్టుబట్టారు. సిలబస్‌ పూర్తి కాకుండానే పరీక్షలు ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. ఈ నెల 28 నుంచి జరగాల్సిన రెండో, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేసే వరకు ఊరుకునేది లేదన్నారు. ప్రిన్సిపాల్స్‌తో సమావేశం పెట్టి నిర్ణయం తీసుకుంటామన్నా విద్యార్థులు ససేమిరా అన్నారు. పాఠాలు సరిగ్గా చెప్పకుండానే పరీక్షలు నిర్వహిస్తే ఎలా రాయాలని విద్యార్థులు ప్రశ్నించారు. యూజీసీ నిబంధనల ప్రకారం ప్రతి సెమిస్టర్‌కూ కనీసం 120 పని దినాల తర్వాతే పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందన్నారు. రెండు నెలలు కూడా పాఠాలు చెప్పకుండానే ఓయూ అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణపై వర్సిటీ వీసీ ప్రొ.రవీందర్‌కు వారం రోజుల కిందట వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదన్నారు. వీసీ రావాలంటూ నినాదలు చేశారు. పీటీపీ ద్వారా పాఠాలు చెబుతున్నారని, ఉదయం నుంచి కొందరు ఆన్‌లైన్‌ తరగతులు బోధిస్తున్నారని, ఇంకా కొన్ని విభాగాల్లో ఇప్పుడే యూనిట్స్‌ బోధిస్తునట్టు విద్యార్థులు తెలిపారు. ల్యాబ్స్‌లో అన్ని సౌకర్యాలు లేవని, కాంట్రాక్టు, పార్ట్‌ టైమ్‌ అధ్యాపకులతో ల్యాబ్స్‌ చేయిస్తున్నారని అన్నారు. ఇలా ప్రశ్నిస్తే ఏదో ఒక రూపంలో తమను టార్గెట్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెమిస్టర్స్‌ వాయిదా వేసే వరకు ఉద్యమిస్తాం అంటూ హెచ్చరించారు. దాంతో రిజిస్ట్రార్‌ వెనుతిరిగి వెళ్లిపోయారు. అనంతరం సాయంత్రం పరిపాలన భవన్‌ వైపు దూసుకుపోతున్న 10 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మరొక వైపు బుధవారం జరిగిన ఇంటర్నల్స్‌ను ఎక్కువ శాతం విద్యార్థులు బహిష్కరించారు.