‘పర్సా’ జీవితం స్ఫూర్తిదాయకం

సీఐటీయూ ఆధ్వర్యంలో శతజయంతి ఉత్సవాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

కార్మికోద్యమ నేత పర్సా సత్యనారాయణ జీవితం స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన కార్మిక పక్షపాతి అనీ, జీవితాంతం వారి హక్కుల కోసమే పనిచేశారని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన శనివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పర్సా సత్యనారాయణ శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పర్సా సత్యనారాయణ సమకాలికులు పీ రాజారావు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌ వీరయ్య, జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు, భూపాల్‌ మాట్లాడారు. అనేక కఠిన పరీక్షలు తట్టుకొని నిలబడిన ధీశాలి ‘పర్సా’ అని చెప్పారు. కార్మికోద్యమం, కష్టజీవుల కోసం జీవితాంతం శ్రమించారని అన్నారు. ఆయన ఆశయసాధనకు కార్యకర్తలంతా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ కార్పొరేట్‌, మతోన్మాద విధానాలను దూకుడుగా అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ విధానాల వల్ల నిరుద్యోగం పెరిగి అసమానతలు పెచ్చరిల్లుతున్నాయనీ, ద్రవ్యోల్బణం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఆఫీసు బేరర్లు ఎస్‌ రమ, పీ జయలక్ష్మి, జే వెంకటేష్‌, బీ మధు, కూరపాటి రమేష్‌, జే మల్లిఖార్జున్‌, కే ఈశ్వరరావు, జే చంద్రశేఖర్‌, రాజారెడ్డి, ముత్యంరావు, కళ్యాణం వెంకటేశ్వర్లు, మందా నర్సింహారావు, ఏజే రమేష్‌, బీరం మల్లేష్‌, గోపాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

Spread the love