పెండింగ్‌ను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చాం

– ప్రకృతి వైపరీత్యాలను సైతం ప్రతిపక్షాలు ప్రభుత్వానికి అంటగడుతున్నారు..
– వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
గత పాలకుల హయాంలో పెండింగ్‌ ఉన్న ప్రాజెక్టులను బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చి పూర్తి చేశామని వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌, టీడీపీల ఏలుబడిలో ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, వలసలు తప్ప ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. శనివారం జడ్చర్ల పట్టణంలో 30 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆస్పత్రిని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలను సైతం ప్రభుత్వాలకు ఆపాధించడం దుర్మార్గమన్నారు. విలువలు కోల్పోయి మాట్లాడుతున్న బీజేపీ నేత బండి సంజరు, కాంగ్రెస్‌ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డికి వచ్చిన పదవులు కేసీఆర్‌ పెట్టిన బిక్ష అన్నారు. 2018లో లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారని, కరోనా వల్ల కొంత ఆలస్యమైనా.. అన్ని సౌకర్యాలతో ఆస్పత్రిని ప్రారంభించుకోవడం సంతోషం అన్నారు. మహబూబ్‌నగర్‌కు మెడికల్‌ కాలేజీ తెచ్చిన ఘనత లాక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌కు దక్కుతుందన్నారు. కాంగ్రెస్‌ వాళ్లు ఒక్క మెడికల్‌ కాలేజీ అన్నా తెచ్చారా అని ప్రశ్నించారు. 100 పడకల ఆస్పత్రులు మేము ఎన్ని పెట్టినం.. మీరెన్ని తెచ్చారో చెప్పాలని సవాల్‌ విసిరారు. కొడంగల్‌లో రేవంత్‌ ఎమ్మేల్యేగా ఉన్నప్పుడు ఒక్క ఆస్పత్రి తేలేదని, లక్ష్మారెడ్డి అక్కడా రెండు 50 పడకల ఆస్పత్రులు పెట్టారని చెప్పారు. పాలమూరు ప్రజలకు మీరు ఇచ్చిన బహుమానం కరువు.. వలసలు. ఆకలి చావులు తప్ప చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో పచ్చని పైర్లతో పాలమూరు రూపుదిద్దుకోవడం చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. గతంలో మన పాలమూరు వాళ్లు సుదూర ప్రాంతాలకు వలస వెళ్లే వారని, ఇప్పుడు ఇక్కడ వ్యవసాయ పనులకు కర్నూలు, బీహార్‌, కర్నాటక ప్రాంతాల నుంచి కూలీలు వలస వస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడి,్డ జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ బండారి భాస్కర్‌ పాల్గొన్నారు.

Spread the love