పెట్రోల్‌ ధరలు ఏపీలోనే అధికం…

Petrol Priceనవతెలంగాణ – ఢిల్లీ: పెట్రోల్‌ ధరలు ఆంధ్రప్రదేశ్ లోనే అధికంగా ఉన్నట్టు (లీటర్‌కు రూ.111.87) కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. డీజిల్‌ ధరల్లో లక్షద్వీప్‌ తొలి స్థానంలో నిలవగా.. ఏపీ రెండో స్థానం (రూ.99.61)లో ఉందని పేర్కొంది. పెట్రోల్‌, డీజిల్‌, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను దేశమంతా ఒకే ధరల విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉందా? అని రాజస్థాన్‌కు చెందిన భాజపా ఎంపీ రాహుల్‌ కశ్వాన్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఒకే చమురు ధరల విధానం ఇప్పటివరకు లేదన్న ఆయన.. రాష్ట్రాల్లో పన్ను ఆధారంగా ధరలు ఉన్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా జులై 18వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల రాజధాని నగరాలు, ముఖ్య పట్టణాల్లో ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల వివరాలను వెల్లడించిన కేంద్రం.. ఏపీలో రిఫరెన్స్‌ సిటీగా అమరావతిని పేర్కొంటూ ధరలు సేకరించింది. అమరావతిలో లీటరు పెట్రోల్‌ ధర రూ.111.87లు ఉండగా.. డీజిల్‌ ధర 99.61గా ఉన్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. ఇకపోతే, తెలంగాణలోని హైదరాబాద్‌ నగరంలో లీటర్ పెట్రోల్‌ రూ.109.66 కాగా.. డీజిల్‌ ధర రూ.97.82గా ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు 2020 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు దిల్లీ నగరంలో పెరిగిన ధరల వివరాలతో వేర్వేరుగా పట్టికలు విడుదల చేసింది.

Spread the love