నార్కోటెక్‌ పరీక్షలకు సిద్ధం

– బ్రిజ్‌ భూషణ్‌ ఛాలెంజ్‌ని స్వీకరించిన రెజ్లర్లు
– ”దేశం ముందు రియల్‌ టైమ్‌ లైవ్‌ టెస్ట్‌ చేద్దాం”
– సుప్రీంకోర్టు పర్యవేక్షించాలి
నార్కోటెక్‌ పరీక్షకు సిద్ధమని అగ్రశ్రేణి రెజ్లర్లు స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సవాల్‌ను ఢిల్లీలో నిరసన చేస్తున్న రెజ్లర్లు స్వీకరించారు. రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ తనతో పాటు వినేశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పూనియాలకు నార్కోటెక్‌ పరీక్ష చేయించుకోవాలని డిమాండ్‌ చేశారు. వినేశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పునియా మాత్రమే కాకుండా మైనర్‌ రెజ్లర్ల సహా ఏడుగురు ఫిర్యాదుదారులు కూడా తనిఖీకి సిద్ధంగా ఉన్నారని నిరసనకారులు మీడియాకు తెలిపారు. ఈ పరీక్షను దేశం ముందు ప్రత్యక్ష ప్రసారం చేయాలని వినశ్‌ ఫోగట్‌ డిమాండ్‌ చేశారు. బీజేపీ ఎంపీ నుంచి బాలికలు ఎదుర్కొంటున్న బాధలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. ఈ పరీక్షలు సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని కూడా ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఇప్పటికే అబద్ధాలు ఆడుతున్న ఆయన ప్రజలను తప్పుదోవ పట్టించడం మానేయాలని బ్రిజ్‌భూషణ్‌ ను బజరంగ్‌ పూనియా కోరారు. అదే సమయంలో మంగళవారం సాయంత్రం ఇండియాగేట్‌లో నిర్వహించనున్న క్యాండిల్‌లైట్‌ మార్చ్‌, 28న ప్రకటించిన నూతన పార్లమెంట్‌ ముట్టడి నిరసనపై పోలీసులు బలప్రయోగం చేయొద్దని క్రీడాకారులు అభ్యర్థించారు. ఆందోళన శాంతియుతంగా ప్రారంభమైందని వినేశ్‌ ఫోగట్‌ తెలిపారు. 28న పార్లమెంట్‌ ముట్టడి నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని పోలీసులు నిర్ణయించారు.

Spread the love