పదోన్నతులు వెంటనే ఇవ్వాలి

– పీఆర్టీయూ తెలంగాణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎలాంటి అడ్డంకుల్లేని ఉపాధ్యాయుల పదోన్నతులను వెంటనే ఇవ్వాలని పీఆర్టీయూ తెలంగాణ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం చెన్నయ్య, సుంకరి బిక్షంగౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం అంజిరెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కోర్టు స్టే బదిలీలకే ఉంది తప్ప పదోన్నతులకు కాదని పేర్కొన్నారు. పదోన్నతుల కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు విడుదల చేసి అడ్‌హక్‌ పద్ధతిలో లేదంటే మరో మార్గంలో ఇవ్వాలని కోరారు. అయినా ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. మన ఊరు మన బడి కింద పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని, బడుల ప్రారంభంలోగా అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో ఎనిమిదేండ్లుగా ఒక్క పదోన్నతికి నోచుకోకుండా ఉపాధ్యాయులే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ దృష్టి సారిస్తే వారంలో పదోన్నతులు కల్పించే అవకాశముందని తెలిపారు. ఈనెలాఖరులోగా పీఆర్సీ కమిటీని వేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరు చేయాలని కోరారు. ఏపీలో సీపీఎస్‌ను రద్దు చేసి జీపీఎస్‌ను తెచ్చిందని, తెలంగాణలోనూ సీపీఎస్‌ను రద్దు చేసి జీపీఎస్‌ కంటే మెరుగైన ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈహెచ్‌ఎస్‌ విధివిధానాలను తయారుచేసి వెంటనే ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు.

Spread the love