కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని తగులపెట్టి నిరసన

– ధాన్యాన్ని ఎగుమతి చేయడం లేదని రైతుల ఆగ్రహం
– సమస్య పరిష్కరిస్తామని అధికారుల హామీ
నవతెలంగాణ-శాయంపేట
ఆరుగాలం శ్రమించి అప్పులు తెచ్చి సాగు చేసి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా రవాణా కొరతతో తూకం వేయకుండా వారాలు వారాలు జాప్యం చేస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యానికి నిప్పు పెట్టారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని ప్రగతిసింగారం గ్రామంలో శనివారం జరిగింది. ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 15న వరంగల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకముందు నుంచి పంట కోసిన రైతులు అక్కడే ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి 4 లారీల్లో 3600 ధాన్యం బస్తాలను నిర్వాహకులు రైస్‌ మిల్లులకు ఎగుమతి చేశారు. రాంపూర్‌లోని సూర్యతేజ రైస్‌ మిల్లు యాజమాన్యం ధాన్యంలో తాలు ఉందని దిగుమతి చేసుకోవడం లేదని రవాణా కాంట్రాక్టర్‌ రైతులకు తెలియపరిచారు. శనివారం పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రానికి చేరుకున్న రైతులు ధాన్యంలో తాలు ఉందన్న నేపంతో రైస్‌మిల్లర్లు, సివిల్‌ సప్లరు అధికారులు కుమ్మక్కై ధాన్యాన్ని తిరిగి పంపిస్తున్నారని ఆగ్రహంలో వడ్ల బస్తాలను తగులబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి 4 లారీల ధాన్యం మాత్రమే రవాణా చేశారని, ఇంకా 50 వేల బస్తాల ధాన్యం రవాణాకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్యాడి క్లీనర్‌తో ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టితే 200 బస్తాలకు మించికావని, మండుటెండలో ఎలా పట్టాలని ప్రశ్నించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో 40 శాతం పంట నష్టపోగా, 60 శాతం మాత్రమే దిగుబడి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం కూడా రాళ్ల వర్షానికి నేలమట్టమైన ధాన్యానికి మాత్రమే పరిహారం చెల్లించిందని మిగతా వారికి పరిహారం చెల్లించలేదని ఆగ్రహించారు. వర్షాలు కురిస్తే పంట తడిసి ముద్ద అయిపోతుందని, కొనుగోలు కేంద్రాలలో పంటను రక్షించుకుంటూ నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్‌ చేశారు. కొనుగోలు కేంద్రానికి చేరుకున్న ఏపిఎం శ్రీధర్‌ రెడ్డి, సీసీ విజరుతో రైతులు వాగ్వివాదానికి దిగారు.
కొనుగోలు కేంద్రంలో ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారన్న విషయం తెలుసుకున్న పరకాల రూరల్‌ సీఐ శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి గంగాజమున, డిప్యూటీ తహసీల్దార్‌ భద్రు నాయక్‌ వచ్చి రైతులతో మాట్లాడారు. ధాన్యంలో తాలు ఉందన్న సాకు చెబుతూ లారీని తిరిగి పంపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన సీఐ శ్రీనివాసరావు రవాణా కాంట్రాక్టర్‌ రాజేశ్వరరావుతో మాట్లాడి ధాన్యాన్ని రైస్‌ మిల్లులో దిగుమతి చేసేలా చూడాలని సూచించారు. రైతులకు నచ్చజెప్పి శాంతింపజేశారు.

Spread the love